దేశ రాజ‌కీయాల్లో కీల‌క‌మైన ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో తిరిగి అధికారం నిలుపుకునేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్వ శ‌క్తులూ ఒడ్డుతున్న విష‌యం తెలిసిందే. ఆ పార్టీకి యూపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న స‌మాజ్‌వాదీ పార్టీ తిరిగి అధికారంలోకి వ‌చ్చేందుకు అదే స్థాయిలో వ్యూహాలు సిద్దం చేసుకుంది. మ‌రోప‌క్క మాయావ‌తి సార‌థ్యంలోని బీఎస్పీ, జాతీయ పార్టీ కాంగ్రెస్  రాష్ట్రంలో పున‌ర్వైభ‌వం కోసం గ‌ట్టి ప్ర‌య‌త్న‌మే చేస్తున్నాయి. అయితే ఇక్క‌డ విప‌క్షాల మ‌ధ్య స‌యోధ్య లేక‌పోవ‌డం బీజేపీకి ప్ర‌ధానంగా క‌లిసివ‌చ్చే అంశ‌మ‌ని ఇప్ప‌టికే రాజ‌కీయ విశ్లేష‌ణ‌లు వెలువ‌డుతుండ‌గా.. వీటికి బ‌లం చేకూర్చేలా ఓ స‌ర్వే రిపోర్ట్ వ‌చ్చింది. తాజాగా వెలువ‌డిన ఏబీసీ సీ ఓట‌ర్ స‌ర్వే యూపీలో మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చేది బీజేపీయేన‌ని తేల్చి చెప్పింది. అధికార పార్టీ 41.5 శాతం ఓట్లతో 435కుగాను 235 స్థానాల‌ను గెలుచుకునే అవ‌కాశం ఉంద‌ని, స‌మాజ్‌వాది పార్టీకి 157 స్థానాలు, బీఎస్పీకి 16, కాంగ్రెస్ పార్టీకి 10కంటే త‌క్కువ స్థానాలు ద‌క్కనున్న‌ట్టు ఈ స‌ర్వే తేల్చింది. దీనిని బ‌ట్టి చూస్తే గ‌త ఎన్నిక‌ల నాటికీ ఇప్ప‌టికీ బీజేపీ బ‌లం భారీగా త‌గ్గినా విపక్షాల అనైక్య‌త కార‌ణంగా బీజేపీ మ‌ళ్లీ యూపీలో పాగా వేయ‌డం ఖాయ‌మేన‌ని చెప్పవ‌చ్చు.
 
ఇదే స‌మయంలో ఉత్త‌రాఖండ్, మ‌ణిపూర్ రాష్ట్రాల్లో మాత్రం బీజేపీ-కాంగ్రెస్ పార్టీల మ‌ధ్య హోరాహోరీ పోరు ఉండ‌బోతోంద‌ని, గోవాలో బీజేపీ హ‌వా కొన‌సాగ‌బోతోంద‌ని ఈ స‌ర్వేలో తేలింది. గోవాలో బీజేపీకి 37 సీట్లు, ఆమ్ ఆద్మీ పార్టీకి 9, కాంగ్రెస్‌కు 8 సీట్లు రావొచ్చ‌ని స‌ర్వే చెప్పింది. పంజాబ్‌లో మాత్రం బీజేపీ ఆశించిన ఫ‌లితాలు రావ‌ని, అక్క‌డ ఆమ్ ఆద్మీ పార్టీ భారీగా బ‌ల‌ప‌డి 58 సీట్లు గెలుచుకుంటుంద‌ని, కాంగ్రెస్ పార్టీకి 43, శిరోమ‌ణి అకాళీద‌ళ్‌కు 23 స్థానాలు వ‌చ్చే అవ‌కాశ‌ముండ‌గా, బీజేపీ కేవ‌లం 3 సీట్ల‌కు మాత్ర‌మే ప‌రిమితం కావ‌చ్చ‌ని తేలింది. మొత్తంమీద యూపీలో తీవ్ర పోటీ ఉన్న కార‌ణంగానే బీజేపీ అక్కడ ఒడ్డెక్కేందుకు హిందూ ఓట్లను సంఘ‌టితం చేసే ప్ర‌య‌త్నాల్లో ప‌డిన విష‌యం తెలిసిందే. అక్క‌డ ఏడు ద‌శ‌ల్లో ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డం కూడా బీజేపీకి క‌లిసొచ్చే అంశ‌మేన‌ని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: