భారత్ లో థర్డ్ వేవ్ మొదలైన సంగతి తెలిసిందే. అదే సమయంలో అసలు థర్డ్ వేవ్ ఎప్పుడు పీక్ స్టేజ్ కి చేరుకుంటుంది. ఎప్పుడు కేసులు తగ్గుతాయి అనే విషయంపై ఇటీవలే ఓ పరిశోధన జరిగింది. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్ స్టిట్యూట్, ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ పరిశోధనల్లో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. కరోనా తగ్గడానికి ముందే దాని విలయ విహారం అందరూ ప్రత్యక్షంగా చూస్తారని తెలుస్తోంది.

రోజుకి ఎన్ని కేసులంటే..?
ప్రస్తుతం భారత్ లో రోజువారీ కేసుల సంఖ్య 3లక్షలకి చేరువలో ఉంది. అయితే ఇక్కడికే మనం కరోనా వ్యాప్తి భారీగా పెరిగిపోయింది అనుకుంటున్నాం. కానీ ఇక్కడితో ఇది ఆగదు. ఈ రోజువారీ కేసుల సంఖ్య దాదాపు 8లక్షల వరకు చేరుకునే అవకాశముందట. అలా గరిష్టంగా 8లక్షలకు చేరుకున్న తర్వాత అప్పటినుంచి తగ్గే అవకాశముంది. అంటే దాదాపుగా రోజువారీ కేసులు 8 లక్షలకు చేరువై, ఆ తర్వాత క్రమక్రమంగా తగ్గుతాయని అంటున్నారు. అలా తగ్గడం మొదలు పెట్టిన తర్వాత ఈ ఏడాది ఏప్రిల్ నాటికి థర్డ్ వేవ్ పూర్తిగా ముగిసిపోయే అవకాశముందని నిపుణుల అంచనా.

అయితే ఈ 8 లక్షల కేసుల అంచనా కేవలం కరోనా కేసుల వ్యాప్తి 100 శాతం ఉంటేనే అనేది గుర్తుంచుకోవాలి. అలా కాకుండా 30 శాతం నుంచి 60 శాతం వరకు కేసుల వ్యాప్తి ఉటే మాత్రం అంతకంటే ముందుగా.. అంటే మార్చి మొదటి వారానికే థర్డ్ వేవ్ ప్రభావం తగ్గే అవకాశముంది. మొత్తమ్మీద నిపుణుల పరిశోధనలు, అంచనాలు కాస్త ఆందోళన కలిగించేలా ఉన్నాయి. ఇప్పుడున్న ఉధృతి ప్రకారం కరోనా వ్యాప్తి ఉంటే మాత్రం రోజువారీ సగటు కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. అయితే ఆ స్థితికి రాకుండా ఉండాలంటే మాత్రం కరోనా నిబంధనలు పాటించాల్సిందే. ఇప్పటికే పలు రాష్ట్రాలు నిబంధనలు అమలు చేయడంలో కఠినంగా ఉన్నాయి. అయినా కూడా పండగ వేళ, కరోనా వ్యాప్తి భారీగా ఉంటుందనే అంచనాలున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: