తిరుమలలో శ్రీవారి దర్శనం విషయంలో అధికారులు ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నా.. రద్దీని నియంత్రించలేరు కదా. అందుకే తిరుమల వెళ్లిన శ్రీవారి భక్తులకు దర్శనం విషయంలో చుక్కలు కనపడుతున్నాయి. సర్వ దర్శనం అంటే.. ఉచిత దర్శన భక్తులకు దర్శన సమయం 25గంటలు పడుతోందని టీటీడీ ప్రకటించింది. అంటే ఒకరోజంతా క్యూ లైన్లో వేచి చూడాలన్నమాట. అందులోనూ వారాంతం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరుగుతోంది. శుక్రవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. దీంతో దర్శన సమయం విషయంలో మరింత ఆలస్యమవుతోందని చెబుతున్నారు అధికారులు.

ఆర్జిత సేవలకు అవకాశమిస్తారా..?
మరోవైపు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవల్లో పాల్గొనేందుకు కొంతమంది భక్తులు ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. వీరంతా కొవిడ్‌ సమయంలో ఆర్జిత సేవలకు ముందస్తు టికెట్లు తీసుకున్నవారు. కొవిడ్ సమయంలో ఆర్జిత సేవల్ని టీటీడీ రద్దు చేసింది. అప్పటికే టికెట్లు పొందినవారికి మరోసారి అవకాశమిస్తామని చెప్పింది. అయితే ఇప్పుడు పరిస్థితి చక్కబడింది కాబట్టి, తమకు అవకాశమివ్వాలని కోరుతున్నారు భక్తులు.

కరోనా ఆంక్షల నేపథ్యంలో 2020 మార్చి 20వ తేదీ నుంచి తిరుమలలో శ్రీవారి ఆర్జిత సేవల్ని ఆపివేశారు. అంటే ఆర్జిత సేవల్ని కేవలం ఏకాంతంగా నిర్వహించేవారు, భక్తులకు అనుమతి ఉండేది కాదు. ఆర్జిత సేవలపై ఉన్న ఆంక్షలను ఈ ఏడాది ఏప్రిల్‌ 1వ నుంచి తీసివేశారు. ఏప్రిల్ 1 నుంచి యధావిధిగా భక్తులకు ఆర్జిత సేవల భాగ్యం కల్పించారు. కానీ కొత్తగా టికెట్లు బుక్ చేసుకున్నవారికి మాత్రమే ఈ అవకాశం ఇస్తున్నారు. పాతవారి సంగతి ఇంకా పట్టించుకోలేదు. దీంతో కరోనా సమయంలో ఆర్జిత సేవలకు టికెట్లు తీసుకుని ఆ అవకాశం రానివారు ఇంకా వేచి చూస్తున్నారు. తమకు అవకాశమివ్వాలని కోరుతున్నారు. ఎలాగూ ఆర్జిత సేవలకు ఛాన్స్ ఇచ్చారు కాబట్టి, తమకి కూడా ఏదో ఒక సమయం కేటాయంచాలని కోరుతున్నారు భక్తులు. మరి టీటీడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

ttd