భారత్ పై ఉగ్రవాదుల దాడులు జరగకుండా, శత్రు సైన్యాలు చొరబాటు చేయకుండా నిరంతరం మన సైన్యం పరాహా కాస్తుంది. అయితే ముఖ్యంగా పాక్ సరిహద్దుల వెంబడి ఎప్పుడూ భయానక పరిస్థితులు ఉంటాయి. అప్రమత్తంగా లేకపోతే ముష్కరులు భారత్ లో చొరబడేందుకు సిద్ధంగా ఉంటారు. అయితే ఇటీవల కాలంలో అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి ఉగ్రవాదుల చొరబాట్లు తగ్గాయని అన్నారు నార్త్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది. అయితే పాక్ నుంచి మాత్రం ఎప్పుడూ ప్రమాదం పొంచి ఉందని వెల్లడించారు. ప్రస్తుతం పాక్‌ నుంచి 200 మంది ఉగ్రవాదులు మన దేశంలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, అయితే మన పహారా వల్ల వారి ఆటలు సాగటంలేదని చెప్పారు. ఎల్‌ఓసీ వద్ద ఉన్న భద్రతా పరిస్థితులను ఆయన మీడియాకు వివరించారు. పర్వత ప్రాంతాలు, అడవుల ద్వారానే కాకుండా జమ్మూ, పంజాబ్, నేపాల్ లోని మైదాన ప్రాంతాల నుంచి కూడా ఉగ్రవాదులు చొరబాట్లకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

చొరబాట్లను అడ్డుకునే యంత్రాంగం భారత్ కు పటిష్ఠంగా ఉందని అన్నారు ఉపేంద్ర ద్వివేది. అన్ని రిజర్వ్ బలగాలను రంగంలోకి దించామని, పహారా పటిష్టం చేశామని చెప్పారు. 2021 ఫిబ్రవరి నుంచి భారత్- పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో కాల్పుల విరమణ ఒప్పందం సమర్థంగా అమలవుతోందని చెప్పారు ఉపేంద్ర ద్వివేది. అయితే కాల్పుల విరమణ ఉల్లంఘనలు అప్పుడప్పుడు జరుగుతున్నాయి. గత ఏడాది కాలంలోల కేవలం రెండు లేదా మూడు కాల్పుల విరమణ ఉల్లంఘన ఘటనలు మాత్రమే జరిగాయని ఆయన వెల్లడించారు.

విదేశీ ఉగ్రవాదులతో, స్థానిక ఉగ్రవాదులు కూడా రహస్య ప్రాంతాల్లో ఉన్నట్టు తమకు సమాచారముందని చెప్పారాయన. ప్రస్తుతం 40 నుంచి 50 మంది స్థానిక ఉగ్రవాదులు భారత్ లో కుట్రలు చేయడానికి పనిచేస్తున్నారని అన్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 21 మంది విదేశీ ఉగ్రవాదుల్ని భారత సైన్యం మట్టుబెట్టింది. శిక్షణ పొందిన ఉగ్రవాదుల సంఖ్య క్రమంగా తగ్గుతోందని, దీనికి కారణం మన అణిచివేతేనని అన్నారు. గతంలో నిషేధిత సంస్థల్లో టీనేజర్లు ఎక్కువగా చేరేవారని, కానీ ఆర్టికల్ 370 రద్దు తర్వాత పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చిందని చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: