తిరుమల కొండపై పొగాకు ఉత్పత్తులు, మందు, మాంసం నిషేధం. అలాంటి వాటిని కిందనుంచి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తే వెంటనే పోలీసులు తనిఖీ చేసి అడ్డుకుంటారు, వారిని అదుపులోకి తీసుకుంటారు. కాలి నడక మార్గం, ఘాట్ రోడ్... ఇలా అన్ని చోట్ల నిఘా పగడ్బందీగా ఉంటుంది. కొన్నిసార్లు తనిఖీల్లో కొంతమంది పట్టుబడిన ఉదాహరణలు ఉన్నాయి. ఇకపై విజయవాడ కనకదుర్గ ఆలయం విషయంలో కూడా ఇలాంటి నియమాలు తీసుకు రాబోతున్నారు అధికారులు. ఇంద్రకీలాద్రి కొండపైకి కూడా పొగాకు ఉత్పత్తులు, మందు, మాంసం తీసుకెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

విజయవాడలోని ప్రముఖ పుణ్యక్షేత్రం దుర్గమ్మ గుడి, ఇంద్రకీలాద్రిపై వెలసి ఉంది. కనకదుర్గ ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లి విరుస్తుంది. ఇలాంటి ఆధ్యాత్మిక వాతావరణంలోకి పొగాకు ఉత్పత్తుల వినియోగం నిషేధానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇంద్రకీలాద్రిపైకి వచ్చేవారిని క్షుణ్ణంగా తనిఖీ చేసి సిగరెట్లు, గుట్కా, పాన్‌ మసాలా, ఖైనీ వంటి పొగాకు ఉత్పత్తులు ఉంటే వారిని అనుంతించకూడదని నిర్ణయం తీసుకున్నారు. కోట్సా చట్టం ప్రకారం అలాంటి వారిని కొండపైకి అనుమతించరు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు.. దీనికి సంబంధించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దుర్గ గుడి విషయంలో కోట్సా చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేలా విధి విధానాలు ఖరారు చేయాలని ఆలయ ఈవో, ఆలయ సెక్యూరిటీ అధికారులు, ఇతర అధికారులకు ఆదేశారు జారీ చేశారు.

ఇందకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను దర్శించుకునేందుకు మెట్ల మార్గం, మహా మండపం, ఘాట్ రోడ్ ఉన్నాయి. ఇక్కడ నిఘా పెడతారు. పొగాకు ఉత్పత్తులు వినియోగించకుండా, అసలు పైకి తేకుండా చర్యలు తీసుకుంటున్నారు. దీనికోసం ముందుగా కోట్సా చట్టంపై పోలీసులు, ఆలయ సిబ్బంది, ఇతర ఉద్యోగులకు అవగాహన కల్పించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. వ్యాపారులకు కూడా ఇకపై ఇలాంటి ఉత్పత్తులు అమ్మ వద్దని సూచిస్తున్నారు. ఎవరైనా దొంగచాటుగా అమ్మాలని చూసినా కోట్సా చట్టం ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఈనెల 25నుంచి ఈ నిబంధనలు అమలులోకి వస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: