కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజకీయ భవిష్యత్తు తొందరలోనే తేలిపోతుంది. బీజేపీ అభ్యర్ధిగా పోటీచేసిన తమ్ముడు కోమటిరెడ్డిరాజగోపాలరెడ్డి మునుగోడు ఉపఎన్నికలో ఓడిపోయారు.   మూడునెలల క్రితం అన్న మద్దతు చూసుకునే తమ్ముడు కాంగ్రెస్ మునుగోడు ఎంఎల్ఏగా రాజీనామా చేశారు.  అయితే కొద్దిరోజులయ్యేసరికి సీనంతా మారిపోయింది.  ఉపఎన్నికలో జరిగిన పరిణామాలు అన్న, దమ్ములకు ఎదురుతిరిగాయి.






ఇంకా క్లారిటిగా చెప్పుకోవాలంటే రాజగోపాలరెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన కారణంగానే ఉపఎన్నిక అనివార్యమైంది. రాజగోపాలరెడ్డి ఎందుకంత ధైర్యంగా రాజీనామా చేశారంటే అన్న వెంకటరెడ్డి మద్దతుచూసుకునే. తాను పార్టీమారినా తమ మద్దతుదారులందరినీ కాంగ్రెస్ కు కాకుండా బీజేపీకి పనిచేసేట్లుగా వెంకటరెడ్డి మ్యానేజ్ చేస్తారన్న ధైర్యంతోనే పార్టీమారారు. అయితే రాజగోపాలరెడ్డి పార్టీమారిన తర్వాత సీన్ రివర్సయిపోయింది. తమ్మడి అంచనాలతో పాటు అన్న రాజకీయం కూడా పనిచేయలేదు.





బీజేపీలో చేరేముందు రాజగోపాలరెడ్డి వేసుకున్న అంచనాలన్నీ తల్లకిందులైపోయాయి. ప్రచారంలో ఎక్కడికి వెళ్ళినా చుక్కలు కనిపించాయి. ఇదే సమయంలో వెంకటరెడ్డి కాంగ్రెస్ లోని మద్దతుదారులను తమ్ముడి గెలుపుకు పనిచేయమని అడిగితే చాలామంది ఎదురుతిరిగారు. కాంగ్రెస్ ఎంపీగా ఉండి డైరెక్టుగా బీజేపీ అభ్యర్ధికి పనిచేయలేక కుటుంబంతో కలిసి ఆస్ట్రేలియాకు వెళిపోయారు. దాని ప్రభావమే 11,666 ఓట్ల తేడాతో రాజగోపాలరెడ్డి ఓటమి.






ఇప్పుడు విషయం ఏమిటంటే తమ్ముడి కత తేలిపోయింది కాబట్టి వెంకటరెడ్డి కాంగ్రెస్ లో కంటిన్యు అవుతారా లేదా అన్నది సస్పెన్సుగా మారింది. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని అధిష్టానం ఎంపీకి షోకాజ్ నోటీసిచ్చింది. ఇపుడు ఎంపీ ఏమిచేయబోతున్నారనేది కీలకంగా మారింది. పార్టీకన్నా తామే చాలా గొప్పని తమను తాము చాలా ఎక్కువగా అంచనా వేసుకున్నారు. దాంతోనే తలబిరుసుతో తమిష్టం వచ్చినట్లు వ్యవహరించారు. దాని ఫలితమే తాజా ఎన్నికల్లో తమ్ముడి ఓటమి. మరిపుడు షోకాజ్ నోటీసుకు సమాధానమిస్తారా ? ఏమిస్తారనేది చూడాలి.  నోటీసుకు సమాధానం ఇవ్వకుండా రిటైర్మెంట్ ప్రకటిస్తారా ?   లేకపోతే  పరిస్ధితులను బట్టి నిర్ణయం తీసుకుంటారా ? పార్టీలోనే కంటిన్యు అయితే మిగిలిన సీనియర్లు ఊరుకుంటారా ?

మరింత సమాచారం తెలుసుకోండి: