రాష్ట్రంలో తుది దశ పంచాయతీ ఎన్నికలు ఆదివారం నిర్వహించనున్నారు. 2,743 సర్పంచి, 22,423 వార్డు సభ్యుల స్థానాలకు ఉదయం 6.30 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. 13 జిల్లాల్లోని 16 రెవెన్యూ డివిజన్లలోగల 161 మండలాల్లో 67,75,226 మంది ఓటు హక్కు వినియోగించుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే మూడు దశల పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ దశతో రాష్ట్రంలో నోటిఫికేషన్ ఇచ్చిన 13,097 పంచాయతీల్లో ఎన్నికలు పూర్తవుతాయి.6,047 పోలింగ్ కేంద్రాలు సమస్మాత్మక, మరో 4,967 కేంద్రాలు అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించి, అదనపు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 15,268 బ్యాలెట్ బాక్సులు, ఇతర పోలింగ్ సామగ్రితో ప్రత్యేక వాహనాల్లో ఎన్నికల సిబ్బంది శనివారం సాయంత్రం నిర్దేశిత గ్రామ పంచాయతీలకు చేరుకున్నారు. పోలింగ్ నిర్వహణ, పర్యవేక్షణ, ఓట్ల లెక్కింపు కోసం 96 వేల మంది అధికారులు, ఉద్యోగుల సేవలను వినియోగించుకుంటున్నారు.