2003లో ఒక పాదయాత్ర.. ఉమ్మడి ఏపీ చరిత్ర గతిని మార్చింది. సంక్షేమ పాలనకు బీజం వేసింది. 2017లో మరో పాదయాత్ర.. విభజన తర్వాత మిగిలిన ఏపీలో కొత్త చరిత్ర సృష్టించింది. మరోసారి సంపూర్ణ సంక్షేమ రాజ్యానికి ఊపిరి పోసింది. అదే ప్రజా సంకల్ప యాత్ర. మొదటి యాత్ర వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేస్తే.. రెండోయాత్ర వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేశారు.


2017 నవంబర్‌ 6..వైయస్‌ఆర్‌ జిల్లా ఇడుపులపాయ సాక్షిగా ఈ కొత్త చరిత్ర పురుడు పోసుకుంది. ప్రజలకు ఓ నమ్మకం, ఓ ధైర్యం, ఓ భరోసా ఇవ్వాలనే ప్రజా సంకల్పంతో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాదయాత్ర మొదలుపెట్టారు. ప్రజల చెంతకే నడుచుకుంటూ వెళ్లాడు. రుతువులు మారాయి. క్యాలెండర్‌ పేజీలు మారాయి. పాదయాత్రికుడైన వైయస్‌ జగన్‌ జనం మనిషై పోయాడు.


నాడు ప్రజా ప్రస్థానం. వైయస్‌ఆర్‌ను ప్రజల గుండెల్లో మరుపురాని నేతగా మలిచిన ఓ అద్భుతం. మరో ప్రజా ప్రస్థానం పేరుతో మహానేత తనయ వైయస్‌ షర్మిలమ్మ సైతం నడిచారు. నాటి వైయస్‌ఆర్‌ పాదయాత్ర ఫలితాలు ఆయన పాలన కాలంలో ప్రతిఫలించాయి. అప్పటిదాకా విశాలాంధ్రకు అనుభవం లేని అద్భుతమైన సుపరిపాలన సాగింది. సంక్షేమం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లితే, అభివృద్ధి పరుగులు పెట్టింది.


చట్ట సభలో పదే పదే ప్రతిపక్షం గొంతు నొక్కుతున్న తరుణంలో ఇక ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటానంటూ పాదయాత్రగా బయలుదేరాడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. 14 నెలల పాటు సుదీర్ఘంగా 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన వైయస్‌ జగన్‌ పేదల గుండె ఘోష విన్నారు. వైయస్‌ఆర్‌ జిల్లాలో మొదలైన పాదయాత్ర కర్నూలు జిల్లాలో ఓ ఉప్పెనగా మారింది. జన ఉప్పెనతో ప్రకాశం బ్యారేజ్‌ ఊగింది. రాజమండ్రి వద్ద ఉన్న గోదారి బ్రిడ్జిపై జనసంద్ర ప్రకంపనలు సృష్టించింది.


తమ కోసం ఒక నమ్మకమై నడిచొచ్చిన వైయస్‌ జగన్‌లో ఒక ఆత్మబంధువును చూసుకున్నారు. జనం జగన్ ను అక్కున చేర్చుకున్నారు. వారి కష్టాలు, కన్నీళ్లు, ఆనందాలు, అనుభూతులు, ఆప్యాయతలలో వైయస్‌ జగన్‌ను భాగస్వామిని చేశారు. వారికి భరోసాగా తాను నిలబడి తీరాలన్న సంకల్పం జగన్‌లో గట్టిగా నిలిచేలా చేశారు. అలా జగన్ పాదయాత్ర ఓ కొత్త చరిత్రను సృష్టించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: