గత కొన్ని రోజులుగా కృష్ణా జిల్లాలోని గన్నవరం, గుడివాడ నియోజకవర్గాలు హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఈ రెండు నియోజకవర్గాల్లో టీడీపీకి గట్టి షాకులు తగిలాయి. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీని వీడగా, గుడివాడ టీడీపీ ఇన్ చార్జ్  దేవినేని అవినాష్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. అయితే వీరిద్దరు పార్టీని వీడటంతో గుడివాడ, గన్నవరం నియోజకవర్గాల్లో టీడీపీకి అండగా నిలిచే నాయకుడే లేకుండా పోయాడు.

 

అయితే ఇలా కష్టాల్లో కొట్టమిట్టాడుతున్న సమయంలోనే గుడివాడలో టీడీపీకి మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. ఆ పార్టీ కీలక నేత, ది గుడివాడ కోఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంకు ఛైర్మన్‌ పిన్నమనేని పూర్ణవీరయ్య (బాబ్జీ) టీడీపీని వీడనున్నారని తెలుస్తోంది. ఆయనకు మరోసారి ఛైర్మన్ అయ్యే అవకాశం ఇచ్చేందుకు వైసీపీ సిద్ధంగా ఉందని వార్తలు వస్తున్నాయి. దీంతో ఆయన వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధంచేసుకున్నారని తెలుస్తోంది.

 

బాబ్జీనే మరోసారి చైర్మన్‌గా 16మంది డైరెక్టర్లతో అర్బన్‌ బ్యాంకు బోర్డును నియమించాలని అనుకుంటున్నట్లు సహకార వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీంతో ముందుగా విధించిన షరతుల ప్రకారమే బాబ్జీ వైసీపీలో చేరతారని అంటున్నారు. అయితే అర్బన్‌ ఎన్నికలు నిర్వహిస్తే మాజీ ఎమ్మెల్యే రావి హరిగోపాల్‌ తనయుడు శ్రీనివాస్‌చౌదరి పోటీ చేయడానికి తన ప్యానల్‌ను సిద్ధం చేసుకున్నారు.

 

అయితే ఎన్నికలు నిర్వహించకుండా డైరెక్ట్ నామినేటెడ్‌ కార్యవర్గాన్ని చేయాలని వైసీపీ భావిస్తోంది. ఇక త్వరలోనే దీనిపై నోటిఫికేషన్ వెలువడే అవకాశముంది. దీంతో శ్రీనివాస్ చౌదరి వర్గీయులు కోర్టుని ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మొత్తానికైతే పిన్నమనేని బాబ్జీకు ఛైర్మన్ పదవి వస్తుండటంతో టీడీపీకి గుడ్ బై చెప్పేయడం ఖాయంగా కనిపిస్తోంది. పిన్న‌మ‌నేని బాబ్జీ మాజీ మంత్రి పిన్న‌మ‌నేని కోటేశ్వ‌ర‌రావుకు స‌మీప బంధువు అవుతారు. ఏదేమైనా గుడివాడ‌లో ఇది టీడీపీకి మ‌రో ఎదురు దెబ్బే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: