ఫార్చూన్ సంస్థ ఏటా నిర్వహించే బిజినెస్‌పర్సన్‌ ఆఫ్‌ ద ఇయర్‌ రేసులో ఇండియన్స్ సత్తా చాటారు. భారతీయ సంతతి వ్యక్తులైన సత్య నాదెళ్ల, అజయ్‌ బంగా, జయశ్రీ ఉల్లాల్‌ టాప్ టెన్ లో చోటు దక్కించుకుని గర్వకారణమయ్యారు. ప్రధానంగా సత్య నాదెళ్ల తాజాగా ఫార్చూన్‌ వెల్లడించిన బిజినెస్‌పర్సన్‌ ఆఫ్‌ ద ఇయర్‌-2019 జాబితాలో టాప్ ప్లేస్ దక్కించుకున్నాడు.

 

ప్రపంచంలోని దిగ్గజ కంపెనీల సీఈవోలు, అధినేతలను తలదన్ని అందరికంటే ముందు నిలిచాడు. అత్యుత్తమ లక్ష్యాలు సాధించి అసాధ్యమైన సవాళ్లను ఎదుర్కొన్న వారికి ఈ జాబితాలో చోటు కల్పిస్తారు. వినూత్న పరిష్కారాలు కనుగొన్న 20 మంది అత్యుత్తమ వ్యాపారవేత్తలను ఈ జాబితాకు ఎంపిక చేస్తుంది ఫార్చూన్‌ సంస్థ.

 

ఈ జాబితాలో సత్య నాదెళ్లతో పాటు మరికొందరు భారతీయ సంతతి వ్యక్తులు ఉన్నారు. వారు ఎవరంటే.. మాస్టర్‌ కార్డ్‌ సీఈఓ అజయ్‌ బంగా, అరిస్టా అధిపతి జయశ్రీ ఉల్లాల్‌. బంగా 8వ స్థానంలో; ఉల్లాల్‌ 18వ స్థానంలోను ఉన్నారు. ఈ సందర్భంగా సత్య నాదెళ్ల మాట్లాడుతూ.. నాపై నాకు నమ్మకం ఎక్కువ.. అదే సమయంలో మిగతా వారినీ ఎదగనిస్తాను. సీఈఓలకు అద్భుతమైన బృందం లేకుంటే ఏమీ చేయలేదు. అదృష్టవశాత్తూ నాకు అది లభించిందన్నాడు.

 

ఇక మాస్టర్‌కార్డ్‌ ఆర్థిక సేవల్లో తనదైన ముద్రను వేయడం వెనక బంగా దూరదృష్టి ఉందని ఫార్చూన్‌ పేర్కొంది. ఈ ఏడాది ఈ కంపెనీ షేరు 40 శాతం పైగా పెరిగి మదుపర్లకు అత్యంత ప్రీతిప్రాతమైన షేరుగా మారిందని గుర్తు చేసింది. జయశ్రీ ఉల్లాల్‌ కూడా తన కంపెనీ అరిస్టాను ఈథర్‌నెట్‌ స్విచెస్‌, ఓపెన్‌ సోర్స్‌ క్లౌడ్‌ సాఫ్ట్‌వేర్‌లో ఒక స్పెషల్ మార్కెట్‌ దిగ్గజంగా మార్చారని మెచ్చుకుంది. భారతీయుల మేథస్సుకు, నాయకత్వ లక్షణాలకు, వ్యాపార దక్షతకు ఈ ముగ్గురూ ప్రతినిధులుగా నిలచి ఇండియాను గర్వపడేలా చేశారంటే అతిశయోక్తి కాదు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: