ప్రశాంత్ కిషోర్.. ఇప్పుడు దేశంలో రాజకీయ పార్టీలకు అతనో ఆశాకిరణం.. ఎన్నికలను కూడా ఓ కార్పొరేట్ కంపెనీ వ్యవహారంలా మార్చేసిన ఘనుడాయన. ఎన్నికల వ్యూహకర్తగా ఆయన సక్సస్ రేటు బాగానే ఉంది. ఇటీవల ఏపీలో వైసీపీని అధికారంలో తీసుకురావడంలో ఆయన వ్యూహాలు బాగా పనిచేశాయన్న పేరు వచ్చింది. అందుకే ఇప్పుడు పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ ఆయన సేవలు వినియోగించుకుంటోంది.

 

అయితే అక్కడ రంగంలోకి దిగిన ప్రశాంత్ కిషోర్ కు టీఎంసీ నేతలు షాక్ ఇస్తున్నారట. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. అక్కడ తృణమూల్ కాంగ్రెస్ నేతల సమావేశంలో ఆయన ఈ విషయం చెప్పారు. ఎన్నికల వ్యూహాల అమలు కోసం.. ప్రతి పోలింగ్ బూత్ లోను ఐదుగురు ఎస్సి కార్యకర్తలను గుర్తించి వారి పేర్లను పంపించాలని ప్రశాంత్ కిషోర్ బృందం టీఎంసీ నేతలను కోరిందట.

 

కానీ.. టీఎంసీ నేతలు ఇచ్చిన జాబితాలు చూసి ప్రశాంత్ కిషోర్ టీమ్ అవాక్కయిందట. ఎందుకంటే.. వారు ఇచ్చింది పనిచేసే కార్యకర్తల జాబితాలు కాదు. అంత కష్టం ఎవరు పడతారు అనుకున్నారో ఏమో.. తమ వద్ద పనిచేసే డ్రైవర్లు, గార్డెనర్లు, ఇంటిపనివారి పేర్లతో జాబితాలు తయారు చేసి ఇచ్చేసి చేతులు దులుపుకున్నారట.

 

ఆ జాబితాలు ముందు పెట్టుకుని రంగంలో దిగిన కిషోర్ టీమ్ కు వారి గురించి తెలుసుకుని షాక్ అయ్యారట. అసలు వీళ్లకు రాజకీయాలతో సంబందం లేదని తెలిసి ఆశ్చర్యపోయారట. ప్రశాంత్ కిషోర్ టీఎంసీ నేతలతో ఈ విషయం చెప్పి ఇలాగైతే ఎలా అని నిలదీశారట. మరి టీఎంసీ నేతలా మజాకా..?

 

మరింత సమాచారం తెలుసుకోండి: