ఇంగ్లీష్ మీడియం చదువులపై అసెంబ్లీలో వాడి వేడి చర్చ జరిగింది. ఈ సమయంలో చంద్రబాబు, జగన్ మధ్య వాగ్యుద్దం కూడా జరిగింది. చంద్రబాబు అలవాటుగా ఈ విషయంలోనూ యూ టర్న్ తీసుకున్నాడని జగన్ విమర్శించారు. అంతే కాదు.. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో ఇంగ్లీష్ మీడియానికి వ్యతిరేకంగా వార్తలు రాయించారని జగన్ ఆరోపించారు. ఆయా పత్రికల్లో వచ్చిన వార్తలను అసెంబ్లీలో చదివి వినిపించారు.

 

జగన్ ఏమన్నారంటే..ప్రభుత్వ బ‌డుల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశ‌పెడుతూ జీవో పాస్ అయిన నాటి నుంచి టీడీపీలో ఉలిక్కిపాటు మొద‌లైంది. ఆ రోజు నుంచి ప్రభుత్వం మీద ఒక ర‌కంగా చెప్పాలంటే ఒక సామాజిక దాడి మొద‌లైంది. ఇంగ్లిష్ మీడియం ప్రవేశ‌పెట్టకుండా ఉండాలని ఈనాడులో వ‌రుస క‌థ‌నాలు ప్రచురించారు. పేద‌ల పిల్లలు ఇంగ్లిష్ చ‌దువుకుని ఉన్నతంగా స్థిర‌ప‌డాల‌ని ప్రభుత్వం ఆలోచిస్తుంటే.. వీళ్లు మాత్రం ఎలాగైనా అడ్డుకోవాల‌ని ఒక యుద్ధం చేస్తున్నారు.

 

వ‌రుస‌పెట్టి ఈనాడు ప‌త్రిక‌లో మొద‌టి పేజీలో బ్యాన‌ర్ స్టోరీలు ప్రచురించారు. ఇంగ్లిష్ మాధ్యమాన్ని నేను అడ్డుకోలేద‌ని గింజుకునే చంద్రబాబు, బ‌య‌ట పెట్టమ‌ని స‌వాల్ చేసిన చంద్రబాబు 16.11.2019న తుగ్లక్ చ‌ర్యల‌ను తూర్పారా ప‌ట్టండి అని ఇచ్చిన స్టేట్‌మెంట్ చూసుకోవాలి. ఆంధ్రజ్యోతి, ఈనాడు ప‌త్రిక‌ల్లో తండ్రీకొడుకులు వ‌రుస‌పెట్టి వార్తలు రాయించి అడ్డుకునే ప్రయ‌త్నం చేశారు. కానీ ప్రజ‌ల నుంచి వ్యతిరేక‌త రావ‌డంతో యూట‌ర్న్ తీసుకున్నాడు.

 

న‌వంబ‌ర్ 22న యూట‌ర్న్ తీసుకున్నాడు. న‌వంబ‌ర్ 22న ఆంధ్రం ఆంగ్లం రెండూ అవ‌స‌ర‌మే అంటూ స‌న్నాయి నొక్కులు నొక్కడం మొద‌లు పెట్టాడు. న‌వంబ‌ర్ 26న మాతృభాష‌పై మాట్లాడితే ప్రధానిని కూడా త‌ప్పు ప‌డ‌తారేమోన‌ని మ‌ళ్లీ మొద‌లెట్టాడు.. అంటూ చంద్రబాబు తీరును జగన్ తూర్పారబట్టారు. అదే సమయంలో ఆ రెండు పత్రికలపై విమర్శలు గుప్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: