ముకేశ్ అంబానీ.. దేశంలోనే అతిపెద్ద ధనవంతుడు.. తండ్రి ఇచ్చిన ఆస్తిని ఎన్నో రెట్లు పెంచాడు.. అయితే ముకేశ్ ఆస్తులు వేగంగా పెరుగుతున్నాయి. ఓవైపు తమ్ముడు అనిల్ అంబానీ అప్పుల్లో కూరుకుపోతుంటే.. ముకేశ్ మాత్రం రోజురోజుకూ దూకుడు పెంచుతున్నాడు. 2019 ఏడాది అతనికి ఇంకా బాగా కలసివచ్చింది.

 

ఎందుకంటే.. ఈ ఒక్క ఏడాదిలోనే ముకేశ్ కంపెనీల ఆస్తులు రూ.1.20 లక్షల కోట్లు పెరిగాయట. ఈ శ్రీమంతుడు తాజా లెక్కలతో మరోసారి తనకు పోటీలేదని నిరూపించాడు. 2019లో ముకేశ్ సంపద ఏకంగా 17 బిలియన్‌ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో రూ.1.20 లక్షల కోట్లు పెరిగింది. ఆసియాలో ఇదే అత్యధిక పెరుగుదల అని బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్ల సూచీ తెలిపింది.

 

తాజా లెక్కల ప్రకారం.. డిసెంబరు 23కు ముకేశ్‌ నికర సంపద దాదాపు 61 బిలియన్‌ డాలర్లు అంటే.. రూ.4.27 లక్షల కోట్లు. ఈ పెరుగుదలకు అనేక కారణాలు ఉన్నాయి. 2019లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు ఏకంగా 40 శాతం దూసుకెళ్లడం కూడా ఇందుకు ఓ కారణంగా చెబుతున్నారు. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ సూచీ లాభంతో పోలిస్తే ఆర్‌ఐఎల్‌ షేరు రెట్టింపు పరుగులు తీసింది.

 

అంతే కాదు.. చమురు శుద్ధి, పెట్రో రసాయనాల వ్యాపారాల నుంచి నెమ్మదిగా రిలయన్స్‌ జియో, రిలయన్స్‌ రిటైల్‌ వంటి వినియోగదారు విభాగాల వైపు కంపెనీ అడుగులు వేయడం కూడా కలసివచ్చింది. ముకేశ్ నిర్ణయం పెట్టుబడి దారులకు ఆకర్షించింది. ఇన్వెస్టర్లను మెప్పించింది. ముకేశ్ మరో గెలుపు గుర్రం జియో.. ఈ జియో.. ప్రారంభించిన మూడేళ్లలోపే భారత్‌లో అగ్రగామి టెలికాం సంస్థగా అవతరించింది.

 

ఇంకో విశేషం ఏంటంటే.. వచ్చే మూడేళ్లలో కొత్త వ్యాపారాలు రిలయన్స్‌ ఆదాయంలో 50% సమకూరుస్తాయట. ఎప్పటికప్పుడు కొత్త అవకాశాలను అందిపుచ్చుకోడం ముకేశ్ కు కలిసివస్తోంది. అంతే కాదు..మరో ఏడాదిలో రిలయన్స్‌ గ్రూప్‌ కు అప్పులు లేని సంస్థగా మారబోతోందట. ఇందు కోసం సౌదీ అరామ్‌కోకు వాటా విక్రయిస్తారట.

మరింత సమాచారం తెలుసుకోండి: