రాజకీయాల్లో ఏ నాయకుడైన తమకు భవిష్యత్ ఏ పార్టీలో ఉంటుందో ఆ పార్టీలో వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. అది కూడా అధికార పార్టీ అయితే అందులో ముందు చేరడానికి ఉవ్విళ్లూరుతుంటారు. ఇక ఇదే పని చేయడానికి మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సిద్ధమైనట్లు చిత్తూరు రాజకీయ వర్గాల్లో ప్రచారం నడుస్తుంది. కిషోర్...తన అన్న కిరణ్ కుమార్ సీఎంగా ఉన్నప్పుడూ చిత్తూరు జిల్లాలో బాగానే చక్రం తిప్పారు. అయితే తర్వాత రాష్ట్రం విడిపోవడంతో కాంగ్రెస్ కనుమరుగైపోవడంతో, కిరణ్ కుమార్ రెడ్డి జై సమైఖ్యాంధ్ర పార్టీ పెట్టి 2014 ఎన్నికల బరిలో దిగి దారుణంగా డిపాజిట్లు కోల్పోయారు.

 

ఇక అప్పుడు కిషోర్ కూడా అన్న పార్టీ నుంచి పీలేరు నుంచి పోటీ చేసి, దాదాపు 57 వేల ఓట్లు తెచ్చుకుని రెండోస్థానంలో నిలిచారు. తర్వాత అన్న కూడా పార్టీ మూసేసి రాజకీయాలకు దూరం కావడంతో కిషోర్ టీడీపీలో చేరారు. చంద్రబాబు కిషోర్‌కు మంచి ప్రాధాన్యత ఇస్తూ, కీలక పదవులు కూడా ఇచ్చారు. తర్వాత 2019 ఎన్నికల్లో పీలేరు టికెట్ ఇచ్చారు. అయితే కిషోర్ అనూహ్యంగా చింతల రామచంద్రారెడ్డి చేతిలో 7వేల మెజారిటీ తేడాతో ఓడిపోయారు.

 

ఓడిపోయిన దగ్గర నుంచి కిషోర్ అడ్రెస్ లేరు. ఏదో చంద్రబాబు జిల్లాకు వచ్చినప్పుడు కనిపించారు తప్ప. మిగతా సమయాల్లో కంటికి కనిపించడం లేదు. అయితే టీడీపీలో ఉంటే  రాజకీయ భవిష్యత్‌కు ఇబ్బందులు వస్తాయని, పైగా చిత్తూరు జిల్లాలో టీడీపీకి నూకలు చెల్లిపోయాని భావిస్తున్నారట. దీంతో వైసీపీలోకి వెళితే భవిష్యత్‌కు ఢోకా ఉండదని అనుకుంటున్నారట. ఇప్పటికే తనకు ఉన్న పాత పరిచయాలు ఉపయోగించుకుని, వైసీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. వైసీపీలో ఉన్న పెద్ద తలకాయల ద్వారా ఫ్యాన్ గాలి కిందకు వెళ్లాలని చూస్తున్నారట. మరి చూడాలి మాజీ సీఎం తమ్ముడు కష్టపడి సైకిల్ తొక్కుతారో, ఫ్యాన్ గాలి కింద సేద తీరుతారో?

మరింత సమాచారం తెలుసుకోండి: