జగన్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు మిగిలిన రాష్ట్రాలకూ ఆదర్శ ప్రాయం అవుతున్నాయి. ప్రత్యేకించి మహిళల భద్రత కోసం ఆయన తీసుకు వస్తున్న దిశ చట్టం ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కొన్ని రాష్ట్రాలు ఈ చట్టం గురించి వాకబు చేస్తున్నాయి. తాము కూడా మహిళల రక్షణ కోసం అలాంటి చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.

 

అందులో భాగంగానే అసలు ఏపీలో దిశ చట్టం, దిశ పోలీస్ స్టేషన్లు, దిశ యాప్ వంటి వాటి వివరాలు తెలుసుకునేందుకు ఏపీకి వస్తున్నారు. తాజాగా మహిళలకు రక్షణ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన దిశ చట్టం పై అధ్యయనం చేసేందుకు మహారాష్ట్ర బృందం పర్యటించింది. మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ తో కూడిన ఉన్నతాధికారుల బృందం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసింది.

 

తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన భేటీలో మహరాష్ట్ర డీజీపీ సుబోత్ కుమార్ జైస్వాల్ , హోం శాఖ అడిషనల్ చీఫ్ సెక్రటరీ తో పాటు మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు. దిశ చట్టం తీసుకు వచ్చేందుకు దారి తీసిన కారణాలు సహా అమలు చేస్తోన్న తీరును బృందానికి ముఖ్యమంత్రి వివరించారు. అంతకు ముందు సచివాలయానికి వచ్చిన మహారాష్ట్ర బృందం తో రాష్ట్ర మంత్రులు, సీఎస్ నీలం సాహ్నీ, సహా పోలీసు ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. దిశ చట్టంలోని అంశాలను హోం మంత్రి మేకతోటి సుచరిత సమగ్రంగా వివరించారు.

 

దిశ చట్టం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఏర్పాట్లను వివరించారు. దిశ పోలీసు స్టేషన్లు సహా దిశ మొబైల్ యాప్ పని తీరును , మహిళలకు అందిస్తోన్న సేవలను సీఎస్ నీలం సాహ్నీ, డీజీపీ గౌతమ్ సవాంగ్ వివరించారు. దిశ చట్టం అమలు పై ప్రత్యేకంగా తయారు చేసిన వీడియో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మహారాష్ట్ర హోం మంత్రి సహా పోలీసు ఉన్నతాధికారుల బృందం వీక్షించింది. దిశ చట్టం పై తమకు ఉన్న సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన దిశ చట్టం చాలా బాగుందని సమావేశం అనంతరం మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ తెలిపారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: