అధికారంలోకి వచ్చి.. 8 నెలలైంది.. ఏం చేశారు ఇప్పటి వరకూ .. మా తప్పులుంటే ప్రభుత్వం మీదేగా.. దమ్ముంటే విచారణ చేయండి.. ఏం చేస్తారో చేసుకోండి.. అంటూ రెంకెలు వేశారు ఏపీ మాజీ సీఎం చంద్రబాబు. కానీ ఇప్పుడు సీన్ మారింది. గత ప్రభుత్వం జరిగిన అక్రమాలపై విచారణ కోసం జగన్ సర్కారు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ సిట్ కు అనేక అధికారాలు ఇచ్చింది.

 

 

ఈ సిట్ విచారణలో భాగంగా.. ఎవరినైనా పిలిపించుకోవచ్చు.. ఎవరి వద్దకైనా విచారణకు వెళ్లొచ్చు.. ఎలాంటి డాక్యుమెంట్లైనా చెక్ చేయవచ్చు.. ఇలా అనేక అధికారాలు ఇచ్చారు. దీంతో ఇప్పుడు చంద్రబాబు బృందంలో కలకలం మొదలైంది. నిన్నటి వరకూ ఎలాంటి విచారణ అయినా చేసుకోండి అన్న చంద్రబాబు ఇప్పుడు క్రమంగా స్వరం మారుస్తున్నారు.

 

 

టీడీపీతో పాటు తనపై వైసీపీ సర్కారు కక్షపూరితంగా వ్యవహరిస్తోందంటూ కామెంట్ చేస్తున్నారు. తనపై కక్ష సాధించేందుకే సిట్ ఏర్పాటు చేశారని చంద్రబాబు అంటున్నారు. 9 నెలల్లో మూడు సిట్ లు, ఐదారు కమిటీలు వేశారని చంద్రబాబు అన్నారు. ఇదంతా తెలుగుదేశం పార్టీని టార్గెట్ గా చేయడమేనంటూ చంద్రబాబు స్పందించారు. అంతే కాదు.. అడ్డగోలు చర్యలతో భావితరాలకు తీరని నష్టం చేస్తున్నారని చంద్రబాబు అంటున్నారు.

 

 

అధికారంలోకి వస్తూనే తవ్వండి.. తవ్వండి అన్నారనీ.. తవ్వితే సన్మానాలు చేస్తాం.. అవార్డులు ఇస్తాం ప్లీజ్ అంటూ అధికారులను బతిమిలాడుకున్నారని చంద్రబాబు అన్నారు. కొత్తగా సిట్ ఏర్పాటుతో కక్ష సాధింపు తప్ప ప్రజలకు కలిగే ప్రయోజనమేంటో చెప్పాలని ప్రభుత్వాన్ని చంద్రబాబు ప్రశ్నించారు. గతంలో వైఎస్ హయాంలో కూడా పలు కమిటీలు వేసి ఏమీ తేల్చలేకపోయారని ఆయన అన్నారు.

 

 

బెదిరింపులకు భయపడేది లేదని చంద్రబాబు అంటున్నారు. మరి విచారణకు ఇబ్బంది లేనప్పుడు కక్షసాధింపు అని మళ్లీ సానుభూతి వచనాలు ఎందుకు.. ఏం చేసుకుంటారో చేసుకోండి.. అంటూ ధైర్యంగా విచారణ ఎదుర్కోవచ్చు కదా..అన్న వాదనలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: