అమరావతి శ్మశానమని, అక్కడ పందులు, గేదెలు తిరుగుతున్నాయి తప్ప, ఎవరూ నివాసముండటం లేదని చెప్పిన ప్రభుత్వపెద్దలు నేడు అదే అమరావతిలో పేదలకు ఇళ్లస్థలాలు ఎలా ఇస్తున్నారో చెప్పాలని టీడీపీనేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు నిలదీశారు. అధికారంలోకి రాకముందు పేదలసంక్షేమం గురించి ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చిన జగన్, ముఖ్యమంత్రయ్యాక వారి పొట్ట కొట్టే చర్యలకు పాల్పడుతున్నాడన్నారు. ఉగాదినాటికి 26 లక్షలమందికి ఇళ్లస్థలాలు ఇవ్వాలని ఆరాటపడుతున్న జగన్ ప్రభుత్వం లెక్కల గిమ్మిక్కులతో పేదలను మరోసారి మోసం చేస్తోందన్నారు. జగన్ ఉగాదినాటికి పంపిణీ చేయాలనుకుంటున్న 26లక్షల ఇళ్లపట్టాల్లో, 14లక్షల పట్టాలు టీడీపీ ప్రభుత్వం ఇచ్చినవేనని ఉమా స్పష్టంచేశారు. 

 

తరతరాల నుంచి దళిత, బీసీ, మైనారిటీ వర్గాల్లోని పేదలు సాగుచేసుకుంటున్న భూములను, తొండలు కూడా గుడ్లు పెట్టని పోరంబోకు భూములను, అసైన్డ్ ల్యాండ్స్ ని, కాలువలు, డొంకలు, పొలిమేరల వంటి వాటిని ఇళ్లస్థలాల పేరుతో ప్రభుత్వం లాగేసుకుందన్నారు. తాత, ముత్తాతల నుంచి వారసత్వంగా వచ్చిన భూమిని జగన్ ప్రభుత్వం లాగేసుకుందన్న మనస్తాపంతో కర్నూలు జిల్లాలోని పాములపాడు మండలం, ఎర్రగూడూరుకు చెందిన భూలక్ష్మి అనే మహిళ బలవన్మరణానికి పాల్పడిందని ఉమా తెలిపారు.   టీడీపీ హాయాంలో మొత్తం 14లక్షల ఇళ్లు నిర్మించి పేదలకు ఇవ్వడానికి నిర్ణయించామన్నారు. వాటిలో 8.50లక్షలకు పైగా ఇళ్లను పూర్తిచేసి, పేదలకు ఇవ్వడం జరిగిందన్నారు.

 

అనంతపురం జిల్లాలో 67,228 ఇళ్లను పూర్తిచేశామని, అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో 50,540, విజయనగరంలో 46,846, విశాఖపట్నం జిల్లాలో 65,258, తూర్పుగోదావరి-1,03,079ఇళ్లను, పశ్చిమగోదావరిలో-75,853, కృష్ణాజిల్లాలో – 53,968, గుంటూరు-64,658ఇళ్లు, ప్రకాశంజిల్లాలో – 48,476, నెల్లూరులో-49,334, చిత్తూరుజిల్లాలో-57,449, కడపలో – 44901, కర్నూలుజిల్లాలో -66,408ఇళ్లను పేదలకోసం నిర్మించడం జరిగిందని బొండా వివరించారు. 


టీడీపీ ప్రభుత్వం వచ్చి ఉంటే, పేదలకు ఆ ఇళ్లన్నీ ఉచితంగా అందచేయడం జరిగేదన్నారు. వైసీపీప్రభుత్వం మాదిరి, జగన్ లా పేదలకు కల్లబొల్లి మాటలుచెప్పి, టీడీపీ ప్రభుత్వం మోసగించలేదన్నారు. ప్రభుత్వంలోని పెద్దలెవరైనా సరే, తాము చెప్పిన ప్రదేశానికి వెళ్లి, ఇళ్లను పరిశీలించవచ్చని ఉమా సూచించారు. చంద్రబాబు నాయుడు జిల్లా కేంద్రాలకు కూతవేటు దూరంలో సకలవసతులతో పేదలకు ఇళ్లను నిర్మిస్తే, జగన్ మాత్రం కొండలు, శ్మశానాలు, వాగుల పక్కన ఊళ్లకుదూరంగా పేదలను ఉంచడానికి ప్రయత్నిస్తున్నాడన్నారు. జనావాసాలకు దూరంగా ఎక్కడో ఊళ్లచివర పేదలకు సెంటుభూమి ఇస్తే, దానిలో వారెప్పుడు ఇల్లు నిర్మించుకోవాలో, ఎలా నివాసముండాలో జగనే సమాధానం చెప్పాలన్నారు. జగన్ ప్రభుత్వ కేబినెట్ తీర్మానం ప్రకారం రాష్ట్రంలో 26లక్షల కుటుంబాలకు సెంటుస్థలం చొప్పున ఇవ్వాలంటే, అందుకోసం మొత్తం 25వేల ఎకరాలు అవసరమవుతుందని బొండా స్పష్టంచేశారు. తిరిగి అక్కడ నివాసముండేవారికి రోడ్లు, డ్రైనేజ్ లు, ఇతరేతర సౌకర్యాలు కల్పించాలంటే అదనంగా మరో 20వేల ఎకరాలు అవసరమవుతుందన్నారు. 

 


జగన్ ఉద్దేశం ప్రకారం 26లక్షలకుటుంబాలకు న్యాయంచేయాలంటే మొత్తంగా 45వేల ఎకరాలభూమి కావాల్సి ఉందని, కానీ ఇప్పటివరకు జగన్ ప్రభుత్వం ఎక్కడాకూడా రూపాయివెచ్చించి, ఒక్క ఎకరం కూడా కొనుగోలు చేయలేదన్నారు. అధికారంలోకి రాకముందు ప్రభుత్వమే భూమిని కొని పేదలకు పంచుతుందని చెప్పిన జగన్, ఇప్పుడు ఆఊసే ఎత్తడంలేదన్నారు. అధికారంలోకి రాగానే ఎడంచేత్తో పేదలస్వాధీనంలోని భూమిని లాక్కుంటున్న జగన్, కుడిచేత్తో తిరిగి వారికే ఇస్తూ, తానేదో పేదల ఉద్ధారకుడైనట్లు మాట్లాడుతున్నాడన్నారు. జగన్ ప్రభుత్వంలా తూతూమంత్రంగా కాకుండా, టీడీపీ హయాంలో 5లక్షలమందికి 2సెంట్ల చొప్పున, ఊళ్లపక్కనే ఇవ్వడం జరిగిందన్నారు. మంత్రులు కొడాలినాని, బొత్స సత్యనారాయణ అమరావతిని గురించి చులకనగా మాట్లాడారని, నేడు అదే అమరావతిలో భూమి ఎలా ఇస్తున్నారో చెప్పాలన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: