ఏపీలో ఎన్నికల సందడి వచ్చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ శంఖారావం పూరించింది. ఏపీలోని 75 పురపాలక సంఘాలు, నగర పంచాయతీలు, 12 నగర పాలక సంస్థల్లో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం సాయంత్రం నోటిఫికేషన్‌ రిలీజ్ చేసింది. దీని ప్రకారం ఎన్నికలు నిర్వహించే పురపాలక, నగర పంచాయతీలు 75. వీటిలో వార్డులు 2,123. వార్డుల్లో రిజర్వు చేసిన స్థానాలు: ఎస్టీ 84, ఎస్టీ 286, బీసీ 643, మహిళ జనరల్‌ 609, జనరల్‌ 501 గా ఉన్నాయి.

 

 

అంతే కాదు.. రాజధాని ప్రాంత పంచాయతీలు, పురపాలక సంఘాలతో కలిపి కొత్తగా నగరపాలక సంస్థను ఏర్పాటు చేస్తున్నారు. అందువల్ల అక్కడ ఎన్నికలు నిర్వహించడం లేదు .అంతకు ముందే.. పంచాయతీ, ఎంపీటీడీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రకటన కూడా వచ్చేసింది. దీంతో ఇక ఏపీలో ఈ 20 రోజులూ రాజకీయం వేడెక్కబోతోంది. అయితే ఈ సందడి కొన్ని ప్రాంతాల్లో అస్సలు కనిపించే ఛాన్సు లేదు. ఎందుకంటే.. వివిధ కారణాలతో 33 నగరాలు, పట్టణాల్లో ఎన్నికలను నిలిపివేసింది.

 

 

మరి ఎన్నికలు నిర్వహించని పురపాలక, నగర పంచాయతీలు మొత్తం 29 వరకూ ఉన్నాయి. అవేంటంటే.. రాజాం, తణుకు, పాలకొల్లు, భీమవరం, తాడేపల్లిగూడెం, గుడివాడ, తాడేపల్లి, బాపట్ల, మంగళగిరి, పొన్నూరు, నరసరావుపేట, కందుకూరు, కావలి, గూడూరు, శ్రీకాళహస్తి, ఆమదాలవలస, రాజంపేట, పామిడి, జగ్గయ్యపేట, ఆకివీడు, దర్శి, గురజాల, దాచేపల్లె, కొండపల్లి, పెనుకొండ, కమలాపురం, బేతంచెర్ల, కుప్పం, బుచ్చిరెడ్డిపాళెం.

 

 

వీటిలోనే కాదు.. కోర్టు కేసుల కారణంగా శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, నెల్లూరు నగర పాలక సంస్థల్లో కూడా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడం లేదు. మరో నగర పాలక సంస్థ కాకినాడలో ఇప్పటికే పాలక వర్గం ఉంది. కాబట్టి అక్కడా ఎన్నికల సందడి కనిపించదన్నమాట. పట్టణ స్థానిక సంస్థల్లో ఈనెల 11 నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. 23న పోలింగ్‌ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5కి ముగుస్తుంది. రీపోలింగ్‌ అవసరమైతే 26న నిర్వహిస్తారు. 27న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: