రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేశారు.. ఇందుకు ఆయన తన విచక్షణ అధికారాలు వాడుకున్నారు. కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకే ఇలా చేశానన్నారు. అంత వరకూ ఓకే.. అలా చేసేందుకు ఆయనకు అధికారం ఉంది. ఆ అధికారం సాక్షాత్తూ రాజ్యాంగం కల్పించింది.. కాబట్టి దాన్ని ప్రశ్నించలేం. కానీ ఆ తర్వాత ఏమైంది..?

 

 

రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉంది.. స్థానిక ఎన్నికలు నిర్వహించడానికి ఎలాంటి ఇబ్బందీ లేదని రాష్ట్ర సీఎస్ ఎన్నికల కమిషనర్ కు లేఖ రాశారు. దీనికి కూడా నిమ్మగడ్డ సమాధానం ఇచ్చారు. తన అధికారాల ప్రకారమే ప్రజలను కాపాడేందుకే స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశానని చెప్పుకొచ్చారు. అంత వరకూ ఓకే.. కానీ ఆయన ఆ తర్వాత మరో మాట అన్నారు.. నేను ఆర్థిక శాఖలోనూ పని చేశాను.. కేంద్రం నిధుల గురించి నాకూ తెలుసు.. అవసరమైతే రాష్ట్రానికి కేంద్ర నిధులు తెచ్చేందుకు నావంతు కృషి చేస్తాను అన్నారు.

 

 

ఇప్పుడు దీన్నే వైసీపీ తప్పుబడుతోంది. అసలు కేంద్రం నుంచి రావాల్సిన నిధులకు తాను బాధ్యుడిగా ఉంటానని ఎన్నికల కమిషనర్‌ ఎలా చెబుతున్నారని ప్రశ్నిస్తున్నారు.. అసలు ఆయన ఎవరూ ?.. కేవలం ఎన్నికల కమిషనర్‌ మాత్రమే. ఆయన ప్రధాని కాదు, రాష్ట్రపతి కాదు. అలాంటప్పుడు రాష్ట్రానికి నిధులు ఎలా ఇప్పించగలరని వైసీపీ నేత దాడి వీరభద్రరావు ప్రశ్నించారు.

 

 

ఎన్నికల కమిషనర్ తన పరిధి దాటి మాట్లాడుతున్నారని దాడి విమర్శించారు. ఇప్పటికైనా ఎన్నికల కమిషనర్‌ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకొని యధావిధిగా ఎన్నికలు నిర్వహించాలని కోరారు. రూ.5 వేల కోట్ల నిధులు కేంద్రం నుంచి రావాలి.. ఎన్నికలు జరిపితే అధి సాధ్యమవుతుంది. ఆ నిధులకు, దీనికి లింక్‌ పెట్టకండి అంటూ ఎన్నికల కమిషనర్‌ చెప్పడం భావ్యం కాదని దాడి అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: