కరోనా ప్రభావం నేపథ్యంలో ఏపీలో లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ లాక్ డౌన్ వల్ల అనేక మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఇబ్బందులు పడుతున్న ప్రజలని ప్రభుత్వం ఏదోరకంగా ఆదుకుంటూనే ఉంది. కానీ లాక్ డౌన్ వల్ల రైతులు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నారు. పంట చేతికొచ్చే సమయంలోనే దేశమంతటా లాక్‌డౌన్‌ అమల్లోకి రావడంతో ఎగుమతులు, దిగుమతులు ఎక్కడివక్కడ స్తంభించిపోయాయి. దీంతో రైతులు బాధలు దారుణంగా ఉన్నాయి.

 

ప్రభుత్వం సాధ్యమైన వరకు ఆదుకుంటున్నా, అది పూర్తిగా రైతులకు మేలు చేయలేకపోతోంది. అయితే అనంతపురం జిల్లాలో ఉద్యాన పంటలు ఎక్కువ పండిస్తారన్న సంగతి తెలిసిందే. గత రెండు, మూడు ఏళ్లుగా ఇక్కడి రైతులు ఈ పంటల మీదే ఆధారపడి ఉంటున్నారు. ఇక ఈసారి కూడా అరటి, చీనీ, బొప్పాయి, కలింగర పంటల్ని అధిక స్థాయిలో సాగు చేశారు.

 

అయితే దిగుబడి మంచిగా ఉంది. కానీ లాక్ డౌన్ వల్ల పంటలను కొనే నాథుడే కరువయ్యారు. కొనుగోలు చేసేందుకు వచ్చిన కొద్ది మంది వ్యాపారులు కూడా.. సగం ధరకు బేరమాడుతున్నారు. దీంతో పొలంలో పంటను వదిలేయలేక  సగం ధరకే పంటను అమ్మేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే అనంతపురం జిల్లాలోని అరటి, చీనీ, బొప్పాయి, కలింగర రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ శింగనమల నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జ్ బండారు శ్రావణి 12 గంటల దీక్ష చేశారు.

 

ప్రభుత్వం వెంటనే దృష్టి పెట్టి, రైతుల సమస్యలని పరిష్కరించాలని కోరారు. ఇక్కడ ఎక్కువ స్థాయిలో చీనీ, అరటి, బొప్పాయి, కలింగర పంటల దిగుమతి వచ్చిందని, వాటికి మంచి ధర దక్కేలా చేయాలని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశారు. అయితే ప్రభుత్వం ఇప్పటికే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడాని ప్రయత్నిస్తున్నారు. ఆక్వా, వరి, చెరకు, పండ్ల తోటలు, మిర్చి తదితర రైతులని ఆదుకునేందుకు తగు చర్యలు కూడా తీసుకుంటుంది. కాకపోతే ఒకేసారి ఇబ్బంది రావడం వల్ల, అధికారులు హ్యాండిల్ చేయలేకపోతున్నారు కాబట్టి,  త్వరలోనే రైతుల సమస్యలు తీర్చే అవకాశముంది.

మరింత సమాచారం తెలుసుకోండి: