ఓ కార్మిక నాయకుడు కృషి పట్టుదలతో ఎదిగితే.. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కావచ్చని నిరూపించిన నాయకుడు టంగుటూరి అంజయ్య. కేవలం పదో తరగతి వరకూ చదువుకున్న వ్యక్తి అంజయ్య. కానీ కార్మిక నాయకుడిగా ఆయనకు ఉన్న పేరు ఏకంగా ఆయన్ను రాజకీయాల్లో విశేషంగా రాణించేలా చేసింది. ఇందిరా గాంధీ మంత్రివర్గంలో ఆయన కార్మికశాఖ మంత్రిగా చేసేలా చేసింది. ఓ కూలీ కేంద్ర కార్మిక శాఖ మంత్రి కావడం అంటే మామూలు విషయం కానే కాదు.

 

 

ఒక్కసారి అంజయ్య జీవిత గమనాన్ని పరిశీలిస్తే.. అంజయ్య 1919, ఆగష్టు 16 న హైదరాబాదు లో జన్మించాడు. అంజయ్య తండ్రి పాపిరెడ్డిది మెదక్ జిల్లా భానూర్ గ్రామం. హైదరాబాద్‌ కు చాలా దగ్గర కావడంతో అంజయ్య కుటుంబం హైదరాబాదు లో స్థిరపడింది. ఆంజయ్య సుల్తాన్ బజార్ ఉన్నత పాఠశాలలో మెట్రిక్యులేషన్ వరకూ చదువుకున్నాడు. హైదరాబాదు ఆల్విన్ పరిశ్రమలో ఆరణాల కూలీగా జీవితము ప్రారంభించాడు.

 

 

వాస్తవానికి అంజయ్య రెడ్డి కులస్తుడే అయినా.. ఏనాడూ.. తాను రెడ్డి అంటూ ప్రకటించుకోలేదు. అంజయ్యగానే ప్రసిద్ధుడయ్యారు. సామాన్యుల్లో సామాన్యుడిగా, నాయకుల్లో నాయకుడిగా ఎదిగాడు. కార్మిక నాయకునిగా ఆయన చూపిన సమర్థత రాజకీయాలవైపు అడుగులు వేయించింది. కాంగ్రెసు పార్టీకి చెందిన అంజయ్య మెదక్ జిల్లా రామాయంపేట నియోజకవర్గము నుంచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

 

 

ఆ తర్వాత ఆయన ఏనాడూ వెనుదిరిగి చూసుకోలేదు. పెద్దగా చదువు లేకపోయినా.. లౌక్యంతో రాజకీయాల్లో నెగ్గుకొచ్చారు. అప్పట్లో కాంగ్రెస్ రాజకీయాలన్నీ ఢిల్లీ కేంద్రంగానే సాగేవి అయినా అంజయ్య దూసుకుపోయాడు. 1980లో అప్పటి సీఎం మర్రి చెన్నారెడ్డిపై కాంగ్రెస్ నాయకుల్లో అసంతృప్తి ఎక్కువైన నేపథ్యంలో అప్పటికే కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్న అంజయ్యను ఇందిరా గాంధీ ఏపీ సీఎంగా నియమించారు. అలా ఆయన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర 8ముఖ్యమంత్రి అయ్యారు. 1980 అక్టోబరు నుండి 1982 ఫిబ్రవరి వరకు 16 నెలలపాటు ముఖ్యమంత్రిగా పాలించారు. ఆరణాల కూలీ నుంచి రాష్ట్ర సీఎం అయిన నేతగా ఖ్యాతి గడించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: