తెలంగాణలో కరోనా భయంకరంగా విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. రోజూ కనీసం 600-700 కొత్త కేసులు వస్తున్నాయి. గత రెండు మూడు రోజుల్లోనే 2000 కేసులు కొత్తగా నమోదయ్యాయి. అందులోనూ తెలంగాణలో టెస్టుల సంఖ్య ఇతర రాష్ట్రాలతో పోలిస్తే చాలా తక్కువ. అంత తక్కువ టెస్టులు చేస్తేనే ఇన్ని కేసులు బయటపడుతున్నాయి.

 

 

ఇక టెస్టుల సంఖ్య పెంచితే సీన్ ఎంత దారుణంగా ఉంటుందోనని తెలంగాణ వాసులు ఇప్పటికే భయపడుతున్నారు. అయితే తెలంగాణలో మొదటి నుంచి టెస్టుల సామర్థ్యం చాలా తక్కువ. ఆ రకమైన పరికరాలపై తెలంగాణ దృష్టి పెట్టలేదు. లేదా దృష్టి పెట్టినా అందుకు ఎలాంటి అడ్డంకులు ఉన్నాయో తెలియదు కానీ.. తెలంగాణ కంటే చాలా చిన్న రాష్ట్రాలు కూడా తెలంగాణ కంటే ఎక్కువ టెస్టులు చేస్తున్నాయన్న విషయం మాత్రం వాస్తవం.

 

 

అయితే కరోనా పరీక్షల విషయానికి వస్తే ఓ గుడ్ న్యూస్ చెబుతున్నారు ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్. అదేంటంటే.. తెలంగాణలోనూ కరోనా టెస్టుల సంఖ్య పెంచుతారట. ఆయన ఏమంటున్నారంటే.. అసలు రోజులు 3500 టెస్టులు చేసే సామర్థ్యం ఉన్న రోస్ కంపెనీకి చెందిన కోబోస్ 8800 మెషీన్లను దేశంలో మొదటి ఆర్డర్ చేసింది తెలంగాణ రాష్ట్రమేనట.

 

 

అయితే ఈ మెషీన్ ను తెలంగాణ ఆర్డర్ చేసినా పట్టించుకోకుండా... కేంద్రం దేశానికి వచ్చిన తొలి మెషీన్‌ను పశ్చిమ బెంగాల్ కు పంపించిందంటూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు ఈటల రాజేందర్. అయితే ప్రస్తుతం తెలంగాణలో 2290 పరీక్షలు చేస్తున్నారట. ఈ సామర్థ్యాన్ని వారం రోజుల్లో 6600 టెస్టులకు పెంచుతారట. అయితే హైదరాబాద్ జనాభా- కరోనా దూకుడుతో పోలిస్తే 6000 టెస్టులు కూడా తక్కువే. అయితే గుడ్డిలో మెల్ల ఆ మాత్రం టెస్టులు జరిగినా మంచిదే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: