అయితే ప్రభుత్వం ఒప్పుకున్నా లేకపోయినా.. కోర్టు ద్వారా ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ తీసుకోవాలని చూస్తున్నారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్. కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని, ఎన్నికలు జరిపేందుకు ఇదే సరైన సమయం అని, ఇతర రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు సజావుగానే సాగుతున్నాయనేది ఆయన వాదన. రాష్ట్రంలో స్కూళ్లను తెరవడంలో ఉత్సాహం చూపించిన ప్రభుత్వం, ఎన్నికలకు ఎందుకు వెనకడుగేస్తోందంటూ ప్రతిపక్షాలు కూడా లాజిక్ తీస్తున్నాయి. ఈ దశలో ఎన్నికలపై వైసీపీలో చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే నూతన జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ఎన్నికలను జిల్లాల విభజన జరిగే వరకు ఆపేయాలనే ఆలోచన చేస్తున్నారు వైసీపీ నేతలు. నూతన జిల్లాల ఏర్పాటుకి, స్థానిక ఎన్నికలకు లింకు పెడుతూ వాయిదా కోరుతున్నారు.
కరోనా అడ్డంకి లేకపోయి ఉంటే.. 2021 జనవరి నాటికి జిల్లాల పునర్విభజన జరగాల్సి ఉంది. ఇప్పుడిది కాస్త ఆలస్యం అవుతోంది. పునర్విభజన, కార్యాలయాల తరలింపు.. వంటి కార్యక్రమాలతో జిల్లా అధికార యంత్రాంగం అంతా కొన్నిరోజులపాటు బిజీగా ఉంటుందని, అందుకే ఎన్నికలు ఇప్పటికిప్పుడు జరపలేమని చెబుతున్నారు వైసీపీ నేతలు. అన్నీ పక్కాగా జరిగితే వచ్చే మరో ఆరు నెలల్లో కొత్త జిల్లాలు ఏర్పడతాయి. అంటే 2021 జూన్, జులై నాటికి కొత్త జిల్లాల్లో స్థానిక ఎన్నికలు జరుగుతాయి. అప్పటికి నిమ్మగడ్డ పదవీకాలం పూర్తవుతుంది కాబట్టి, వైసీపీకి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు.
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎంపీపీ, జడ్పీ చైర్మన్ల ఎంపిక కూడా ఉంటుంది. ఒకేసారి జిల్లాలను విభజించిన తర్వాత కొత్త జిల్లాలకు కూడా చైర్మన్లను ఎంపిక చేస్తే సరిపోతుందని, ఈలోగా హడావిడి పడటం ఎందుకనేది వైసీపీ నేతల వాదన. జిల్లాల పునర్విభజన ప్రభుత్వం కనుసన్నల్లోనే జరుగుతుంది కాబట్టి ఎన్నికలు కూడా అప్పుడే ఉంటాయని తెలుస్తోంది. ఎన్నికల కమిషనర్ ఎంత తొందరపడ్డా ఇప్పుడప్పుడే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే సూచనలు కనిపించడంలేదు. ప్రభుత్వం కొత్త జిల్లాలపై కసరత్తు పూర్తి చేసిన తర్వాత నూతన జిల్లాలు ఏర్పడతాయి, కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాతే స్థానిక ఎన్నికలు జరుగుతాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి