ఆయన ఓ హైకోర్టు న్యాయమూర్తి.. ఇటీవల పదవీవిరమణ చేశారు లెండి.. కానీ.. ఆయన తన చివరి రోజుల్లో ఓ తీర్పులో చేసిన వ్యాఖ్యలు జగన్ సర్కారును వేటాడుతున్నాయి. జగన్ సర్కారు పనితీరుకు అద్దం పడుతున్నాయి. ఆయనే జస్టిస్ రాకేశ్ కుమార్. ఆయనకు న్యాయవ్యవస్థలో నిజాయితీ కలిగిన జడ్జిగా పేరుంది. అందులోనూ ఆయన తెలుగు వాడు కాదు.. తెలుగులో ఇప్పుడు చూస్తున్న కులాల చిచ్చులో ఆయనకు ఎలాంటి పాత్ర లేదు.

మరి అయినా ఆయన ఎందుకు తన చివరి తీర్పులో అంతగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.. అసలు ఆయన ఏం వ్యాఖ్యలు చేశారు.. మిషన్‌ బిల్డ్‌ ఏపీ కింద ప్రభుత్వ ఆస్తుల విక్రయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన కేసు విచారణ నుంచి జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌ వైదొలగాలంటూ.. ఆ సంస్థ డైరెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ వేసిన పిటిషన్‌ పై తీర్పు చెబుతూ.. ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి సీజేఐకి రాసిన లేఖ ప్రచురితమయ్యే వరకు జగన్  గురించి తనకు పెద్దగా తెలియదని... ఆ లేఖ తర్వాత ఆయన గురించి తెలుసుకోవాలన్న ఉత్సుకత పెరిగిందని... గూగుల్‌లో ఖైదీ నంబర్‌ 6093 అని కొడితే చాలా సమాచారం వస్తుందని ఎవరో చెప్పారని.. తాను అలా చేసేసరికి దిగ్భ్రాంతి కలిగించే సమాచారం లభించిందని కామెంట్ చేశారు.

జగన్‌పై 11 సీబీఐ కేసులు, 6 ఈడీ కేసులు, ఐపీసీ సెక్షన్‌ కింద నమోదు చేసిన మరో 18 కేసులు ఉన్నట్టు తెలిసిందని రాకేశ్ కుమార్ అన్నారు. ఆ కేసులన్నీ దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉండగా సుప్రీంకోర్టు ఉత్తర్వులు వెలువడిన తర్వాత ఒకరోజు వాటిలో కొన్ని తప్పుడు కేసులని, వాస్తవాల నమోదులో పొరపాటు జరిగిందని, చర్యలు నిలిపివేశామన్న కారణాలతో పోలీసులు వాటిని మూసేశారని తెలిపారు.  డీజీపీ సారథ్యంలోని పోలీసులు రాష్ట్ర ప్రభుత్వ కనునసన్నల్లో ఎలా పనిచేస్తున్నారో చెప్పడానికి ఇదే నిదర్శనమని రాకేశ్ కుమార్ కామెంట్ చేశారు.

కొన్ని రోజుల క్రితం ఏపీ సీఎం జగన్ ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. అలా సీజేఐకి లేఖ రాయడం ద్వారా జగన్ బాగా లాభం పొందారని రాకేశ్ కుమార్ తెలిపారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని బదిలీ చేయడం వల్ల సీబీఐ ప్రత్యేక కోర్టులో జగన్‌పై కేసుల విచారణలో కొంత జాప్యం జరిగే అవకాశం ఉందని, వాటిపై సుప్రీంకోర్టు పర్యవేక్షణకూ అవరోధం ఏర్పడవచ్చని జస్టిస్‌ రాకేష్‌కుమార్‌ అన్నారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బదిలీ వల్ల సీఎం జగన్ కు అనుచిత లబ్ధి చేకూరుతుందంటున్నారు రాకేశ్ కుమార్.  

అసలు రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా ఉందా.. అసలు ప్రభుత్వం ఉందా.. రాజ్యాంగం అమలవుతుందా.. అంటూ ప్రశ్నించారు. జస్టిస్ రాకేశ్ కుమార్ అయితే ఈ రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందో లేదో తేలుస్తానంటూ సంచలనం సృష్టించారు . మొత్తం మీద ఈ వ్యాఖ్యలు.. జగన్ సర్కారు పనితీరుకు అద్దం పడుతున్నాయని నిపుణలు భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: