తిరుపతి: రెండు తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు ఏ స్థాయిలో అభిమానులు ఉన్నారో కొత్తగా చెప్పనక్కరలేదు. ఏ హీరోకు లేనంత మంది అభిమానులు పవన్ కల్యాణ్ సొంతం. అయితే గత ఎన్నికల్లో మాత్రం జనసేన తరపున పోటీ చేసిన అభ్యర్థుల్లో కేవలం ఒక్కరంటే ఒక్కరు మాత్రమే గెలుపొందారు. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కూడా రెండు చోట్ల పోటీ చేసి.. రెండు చోట్లా కూడా పరాజయం పొందారు. ఆ ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌ను ఆరాధించే అభిమానులు కూడా వైసీపీకే ఓటు వేశారని టాక్ నడిచింది.

అయితే దీనిపై పవన్ కల్యాణ్ ఎప్పుడూ మాట్లాడలేదు. కానీ.. మొట్ట మొదటిసారి పవన్ కల్యాణ్ ఈ విషయంపై నోరు విప్పారు. తిరుమల పర్యటనలో భాగంగా శ్రీవారిని దర్శించుకున్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘మేమంటే అభిమానం ఉండి కూడా వైసీపీకి ఓటేశారు’ అని అన్నారు. తాను ఎక్కడ సభ పెట్టినా లక్షలాది మంది జనం వచ్చారని, తన పై ఎంతో అభిమానం ఉండి కూడా అభిమానులు వైసీపీకే ఓటు వేశారని పేర్కొన్నారు. రాయల సీమలో నిరుద్యోగ అంశం గురించి ప్రస్తావిస్తూ పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

నిరుద్యోగులకు ఉపాధి కలిగిస్తారనే నమ్మకంతోనే వైసీపీ నుంచి పోటీ చేసిన 151 మందిని గెలిపించారని పవన్ కల్యాణ్ అన్నారు. రాయలసీమ యువత వైసీపీ సర్కార్ నిర్వాకంతో నిస్సహాయతతో ఉన్నారని అన్నారు. ఇక ఇటీవల తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వివాదస్పద వ్యాఖ్యల గురించి కూడా పవన్ కల్యాణ్ స్పందించారు. బైటిల్ పార్టీ కావాలా.. భగవద్గీత పార్టీ కావాలా అంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని.. తాను అలాంటి మాటలు మాట్లాడలేనని పవన్ కల్యాణ్ అన్నారు. వరుసగా దేవాలయాలపై దాడులు జరుగుతూ ఉంటే.. ఆ ఆవేదనతో వచ్చిన మాటలు అయి ఉండొచ్చని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: