ఏపీలో అత్యంత కరువుతో ఉండే ప్రాంతం రాయలసీమ. ఆ తర్వాత పల్నాడు. ఎందుకంటే అక్కడ నీటి వసతి తక్కువ. అందుకే జగన్ సర్కారు ఇప్పుడు దృష్టి పెట్టింది. రాయలసీమ, పల్నాడు కరువు నివారణ కోసం ప్రాజెక్టులు నిర్మించాలని యోచిస్తున్నారు. ఇందుకోసం  వివిధ ఆర్థిక సంస్థలతో సూత్రప్రాయ అంగీకారం కూడా కుదుర్చుకుంటున్నారు. ఇవే కాకుండా మిగిలిన ప్రాజెక్టుల నిధుల సమీకరణపైనా దృష్టిపెట్టారు. సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై జరిగిన సమీక్షలో సీఎం వైయస్‌ జగన్‌ ఈ విషయాలు తెలిపారు.

తొలివిడతలో ప్రాధాన్యతా ప్రాజెక్ట్‌ల పనుల పురోగతిపై సీఎం సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. నిర్ధేశించుకున్న లక్ష్యాలలోగా ప్రాజెక్ట్‌లు పూర్తికావాలన్నారు. ప్రత్యేకించి సకాలంలో పోలవరం పూర్తి చేయాల్సిందనన్నారు. పోలవరానికి సంబంధించి ప్రతీ పనిలో కూడా ప్రాధాన్యత నిర్ధారించుకుని ముందుకు సాగాలన్నారు. ఫిబ్రవరి 10 నాటికి స్పిల్‌ వే రోడ్‌ పూర్తిచేస్తామని అధికారులు తెలిపారు. స్పిల్‌ఛానల్‌లో శరవేగంగా పనులు జరుగుతున్నాయని.. రేడియల్‌ గేట్లను అమర్చే ప్రక్రియ ఏప్రిల్‌ నాటికి పూర్తిచేస్తామన్న అధికారులు తెలిపారు.

పోలవరం అప్రోచ్‌ ఛానల్‌ కూడా మే నాటికి పూర్తిచేస్తామని అధికారులు తెలిపారు. డిజైన్ల అనుమతులు ఆలస్యం కాకూడదన్న సీఎం.. అనుమతులకోసం ప్రత్యేకించి ఒక అధికారిని పెట్టాలని సూచించారు. సిలెండర్ల దిగుమతిలో ఆలస్యం లేకుండా చూసుకోవాలని సూచించారు. ఎగువ కాఫర్‌ డ్యాంలో రీచ్‌ 1 మార్చి నెలాఖరుకు, రీచ్‌ 2 ఏప్రిల్‌ నెలాఖరు నాటికి రీచ్‌, 3 మే నెలాఖరు నాటికి, రీచ్‌ 4 మార్చి నాటికి పూర్తిచేసేలా చర్యలు తీసుకున్నామని అధికారులు జగన్ కు వివరించారు.

వచ్చే వర్షాకాలంలోగా కాఫర్‌ డ్యాం పనులు పూర్తవుతాయని అధికారులు వెల్లడించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కాఫర్‌ డ్యాం కారణంగా ఎవరూ ముంపునకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు. ఆలోగా సహాయ పునరావాస కార్యక్రమాలను వేగవంతం చేయాలన్నారు. ప్రాధాన్యతా క్రమంలో నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం ఆర్‌ అండ్‌ ఆర్‌ పనులు చేపట్టాలని సీఎం జగన్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: