భారత దేశంలో
కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగాలు ప్రజలపై కఠినమైన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి కటకటాల వెనక్కి నెట్టడం లో పోలీసులు ఏ మాత్రం సందేహం వ్యక్తం చేయడం లేదు. ప్రజల నిర్లక్ష్యం కారణంగా ప్రస్తుతం
ఇండియా ప్రపంచంలోనే అన్ని దేశాల్లో కెల్లా అత్యంత దయనీయమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది.
ప్రపంచ దేశాలు ఒకటై సహాయం అందిస్తున్నా కూడా పరిస్థితి మెరుగుపడటం లేదంటే
భారత్ ని
కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నరకంలోకి నెట్టివేసిందో కళ్లముందే తెలుస్తోందని
అంతర్జాతీయ మీడియా సైతం తీవ్ర విమర్శలకు తెర లేపింది. దీంతో ఇప్పటికైనా కరోనా మహమ్మారి కట్టడి విషయంలో సీరియస్ గా వ్యవహరించాలన్న ఉద్దేశ్యంతో.. ప్రభుత్వ యంత్రాంగాలు కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని నిర్ధారించాయి. అందుకే తప్పని పరిస్థితులలో కరోనా రూల్స్ బ్రేక్ చేస్తున్న వారిపై జరిమానాతో పాటు అరెస్టు చేస్తున్నారు.
అయితే
ఇండోర్ పోలీసులు మాత్రం ఒక అడుగు ముందుకు వేసి ఒక
కుక్క ని సైతం అరెస్టు చేశారు. కుక్కని
అరెస్ట్ చేయడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? ఇంతకీ ఈ కథాకమామిషు ఏంటో తెలుసుకుందాం.. ఇండోర్‌లోని పలాసియా ప్రాంతంలో ఓ వ్యక్తి తన కుక్కను వెంటబెట్టుకొని బయటకు బయలుదేరాడు. ఆ సమయంలో కోవిడ్ కర్ఫ్యూ అమలవుతుండగా.. పోలీసు బృందం అదే ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తుండగా.. కుక్కతో షికారికి వెళ్తున్న ఒక వ్యక్తి కనిపించాడు.
దీంతో పోలీసులు అతని వద్దకు వెళ్లి అకారణంగా కరోనా సమయంలో బయట ఎందుకు వచ్చావ్ అని ప్రశ్నించారు. అయితే ఆ వ్యక్తి సరైన కారణం చెప్పకపోవడంతో కోవిడ్ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించిన కేసులో అరెస్టు చేశారు. తమాషా ఏంటంటే ఆయనతో పాటు ఉన్న
కుక్క ని సైతం అరెస్టు చేసి జైలుకు తరలించారు. అరెస్టయిన వ్యక్తి ఒక వ్యాపారవేత్త అని.. అతను తన కుక్కను వాకింగ్ చేయించడం కోసం బయటకు వచ్చాడని పోలీసులు వెల్లడించారు.
ఐతే
మీడియా కథనాల ప్రకారం, వ్యాపారవేత్తతో పాటు కుక్కని కూడా జైలుకు పంపారని తెలుస్తోంది. కానీ దీన్ని పోలీసులు ఖండిస్తున్నారు. కొంతమంది జంతు హక్కుల కార్యకర్తలు ఆ వ్యక్తిని, కుక్కను అరెస్టు చేసినందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు.