కరోనా మొదలైన కొత్తలో ప్లాస్మా థెరపీ తెరపైకి వచ్చింది. కోవిడ్‌ సోకి తగ్గినవారి ప్లాస్మా ఇతర రోగులను కాపాడుతుందని, అది అపర సంజీవని అన్నంతగా ప్రచారం పొందింది. కరోనా గురించి పెద్దగా ఏమీ తెలియని సమయంలో ప్లాస్మా థెరపీని ఆశాకిరణంగా భావించారు. కోవిడ్‌ చికిత్సలో ఈ విధానం మంచి ఫలితాలు ఇస్తోందని ప్రభు త్వాలు కూడా ప్రకటించడం, ప్లాస్మా దానం చే యాలంటూ జరిగిన ప్రచారంతో దానికి ప్రాధాన్యత బాగా పెరిగిపోయింది. అయితే ఇటీవల జరిగిన పలు ఉన్నత స్థాయి అధ్యయనాలు మాత్రం.. కోవిడ్‌ చికిత్సలో ప్లాస్మా థెరపీ ప్రయోజనం శూన్యమని తేల్చాయి. అంతేకాదు ప్లాస్మా థెరపీ వల్ల కరోనా వైరస్‌ కొత్త మ్యూటెంట్లు తయారయ్యాయని, వైరస్‌ సామర్థ్యాన్ని పెంచుకుందన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మన దేశంలో కోవిడ్‌ చికిత్సల కోసం అనుసరిస్తున్న ప్రొటోకాల్‌ నుంచి ప్లాస్మా థెరపీని తొలగించాలని భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) నిర్ణయించింది.

ప్లాస్మా థెరపీ వల్ల ఆశించిన ప్రయోజనం లేదని, రోగి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిన దాఖలాలు లేవని యూకే మెడికల్‌ జర్నల్‌ లాన్సెట్‌ తాజా అధ్యయనంలో తేల్చింది. బ్రిటన్‌లో గతేడాది మే 28 నుంచి ఈ ఏడాది జనవరి 25 వరకు 11,558 మంది రోగులను 2 కేటగిరీలుగా విభజించి ఈ అధ్యయనం చేశారు. ప్లాస్మా థెరపీ తీసుకున్న 5,795 మందిలో 1,399 (24 శాతం) మంది మరణించగా.. ఇతర సాధారణ చికిత్స తీసుకున్న 5,763 మందిలో 1,408 (24 శాతం) మంది మరణించినట్టు గుర్తించారు. మెడికల్‌ వెంటిలేషన్‌ అవసరం విషయంలో కూడా ప్లాస్మా, సాధారణ చికిత్సల మధ్య పెద్దగా వ్యత్యాసం లేదు. ఇంతకుముందే మన దేశంలో జరిగిన ఐసీఎంఆర్‌–ప్లాసిడ్‌ అధ్యయనం, అర్జెంటీనాకు చెందిన ప్లాస్మాఆర్‌ ట్రయిల్స్‌ కూడా ప్లాస్మా థెరపీతో రోగులకు పెద్దగా లాభమేమీ లేదని తేల్చాయి. గత శుక్రవారం ఐసీఎంఆర్‌ జాతీయ టాస్క్‌ఫోర్స్‌ సమావేశంలో సభ్యులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో కరోనా చికిత్సల నుంచి ప్లాస్మా థెరపీని తొలగించాలని ఐసీఎంఆర్‌ నిర్ణయించింది. త్వరలో ఆస్పత్రులకు మార్గదర్శకాలు వెలువడనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: