గూగుల్ పే తమ యూజర్లకు తీపికబురు చెప్పింది. ఇప్పుడు అమెరికాలోని వారు భారత్‌కు డబ్బులు పంపడం మరింత సులభంగా మారింది. అమెరికాలోని గూగుల్‌పే వినియోగదారులు భారత్‌తోపాటు సింగపూర్‌లోని యూజర్లకు ఇక డబ్బులు పంపించవచ్చు. ఈ సదుపాయం వల్ల ఎంతో మందికి ప్రయోజనం కలగనుంది. ఈ సదుపాయం కల్పించడానికి వెస్టర్న్‌ యూనియన్‌, వైజ్‌లతో గూగుల్‌పే కలిసి పని చేస్తోంది. ఈ ఏడాది చివరినాటికి యూఎస్‌ గూగుల్‌ పే వినియోగదారులు వెస్టర్న్‌ యూనియన్‌ ద్వారా 200కు పైగా దేశాలకు, వైజ్‌ ద్వారా 80కి పైగా దేశాలకు డబ్బులు పంపగలరని భావిస్తున్నట్టు గూగుల్‌పే బ్లాగ్‌పోస్ట్‌లో పేర్కొంది. చాలా మంది తమ స్వదేశాలకు నగదును తరచుగా పంపుతుంటారని, దీన్ని తాము మరింత సులభతరం చేస్తున్నట్టు పేర్కొంది.

యూఎస్‌లో ఉన్నవారికి డబ్బులు పంపేవాళ్లు పేమెంట్‌ చేసేటప్పుడు ఏ సర్వీసు ద్వారా డబ్బులు వెళ్లాలి అని గూగుల్ పే అడుగుతుంది. అంటే వెస్ట్రన్‌ యూనియన్‌ నుండి వెళ్లాలా, లేక వైజ్‌ నుండి వెళ్లాలా అనేది కోరుకోమంటుంది. డబ్బులు పంపాక వచ్చే రిసిప్ట్‌లో ఈ వివరాలను పొందుపరుస్తారు. దాని వల్ల తర్వాత ఎప్పుడైనా ట్రాక్‌ చేయాలంటే ఉపయోగపడుతుంది. మరోవైపు భద్రత విషయంలోనూ గూగుల్‌ పటిష్ఠ చర్చలు చేపట్టాలని చూస్తోంది. దీని కోసం టూస్టెప్‌ వెరిఫికేషన్‌ను వినియోగదారులందరికీ మాండేటరీ చేయాలని చూస్తోంది. గూగుల్‌ పే నుండి వెస్ట్రన్‌ యూనియన్‌ ద్వారా డబ్బులు పంపిస్తే ఎలాంటి అదనపు రుసుము, ట్రాన్స్‌ఫర్‌ ఫీజులు ఏమీ ఉండవు. అయితే వైజ్‌ నుండి డబ్బులు పంపిస్తే ఫారిన్‌ ఎక్స్ఛేంజ రేటు, ట్రాన్స్‌ఫర్‌ ఫీజు వసూలు చేస్తారు. అయితే ఇది ఒక్కో దేశానికి ఒక్కోలా ఉంటుంది. ఇక గూగుల్‌ పే విషయానికొస్తే జూన్‌ 16 వరకు డబ్బులు ట్రాన్స్‌ఫర్‌కి ఎలాంటి రుసుము వసూలు చేయదు. వైజ్‌ అయితే తొలి ట్రాన్స్‌ఫర్‌కు (500 డాలర్ల వరకు) ఉచిత సేవలు అందించాలని నిర్ణయించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: