నాలుగు ద‌శాబ్దాల రాజ‌కీయ చ‌రిత్ర ఉన్న చంద్ర‌బాబు మాట మాట‌కు ఫార్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ అని చెప్పుకుంటూ ఉంటారు. ఆ 40 ఏళ్ల‌లో చంద్ర‌బాబు ఇప్పుడు ఎదుర్కొంటోన్న అవ‌మానాలు ఎప్పుడూ ఎదుర్కొని ఉండ‌ర‌నే జ‌రుగుతోన్న ప‌రిణామాలు చెపుతున్నాయి. ఏపీలోనే దారుణ‌మైన ప‌రిస్థితి ఉంది. అప్ప‌టి వ‌ర‌కు చంద్ర‌బాబుకు అత్యంత స‌న్నిహితంగా ఉన్న వారు సైతం పార్టీ నుంచి బ‌య‌ట‌కు వెళితే చంద్ర‌బాబును ఘోర‌మైన భాష వాడుతూ తిడుతున్నారు. అస‌లు ఆ తిట్లు వింటుంటే టీడీపీ వీరాభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఇక 2014లో తెలంగాణ విడిపోయిన‌ప్పటి నుంచి అక్క‌డ‌ ఇప్పటి వరకు ఎల్‌. ర‌మ‌ణ‌నే ఆ పార్టీ అధ్యక్షుడిగా కొన‌సాగుతున్నారు.

వాస్త‌వంగా చూస్తే తెలంగాణ‌లో ఆయ‌న‌ కంటే కూడా స‌మ‌ర్థులైన వారు ఉన్నా.. రమణకే రెండుసార్లు ఆ బాధ్య‌త‌లు ఇచ్చారు. ఇందుకు ప్ర‌ధాన కార‌ణం.. వివాద ర‌హితంగా ఉండ‌డంతో పాటు అంద‌రిని క‌లుపుకుని పోతార‌ని బాబు భావించ‌డం... బీసీ కార్డు ఉండ‌డంతో చంద్ర‌బాబు ఆయ‌న్నే పార్టీ అధ్య‌క్షుడిగా నియ‌మించారు. తెలంగాణ‌లో పార్టీ నుంచి గెలిచిన ఎంతో మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిపోయారు. అయితే ర‌మ‌ణ మాత్రం ఎప్ప‌టిక‌ప్పుడు తాను పార్టీ మార‌న‌ని చెపుతూ వ‌స్తున్నారు.

అయితే ఇప్పుడు ర‌మ‌ణ వంతు కూడా వ‌చ్చేసింది. ఆయ‌న కూడా పార్టీ మారే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. ఎన్నాళ్ల‌ని ఆయ‌న మాత్రం ఎలాంటి ప‌ద‌వులు లేకుండా ఈ చ‌చ్చిన టీడీపీలో ఉంటారు ?  కేసీఆర్ ఎమ్మెల్సీ ఆఫ‌ర్ ఇవ్వ‌డంతోనే ర‌మ‌ణ కారెక్కేందుకు రెడీ అవుతోన్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక ర‌మ‌ణ కూడా పార్టీ నుంచి వెళ్లిపోతే తెలంగాణ టీడీపీలో రావుల చంద్రశేఖర్‌రెడ్డి, కొత్తకోట దయాకర్‌రెడ్డి, అరవింద్‌ కుమార్‌ గౌడ్ వంటి త‌క్కువ మంది .. ఇంకా చెప్పాలంటే వేళ్ల మీద లెక్క‌బెట్టే నేత‌లే పార్టీలో ఉంటారు.

విచిత్రం ఏంటంటే కొద్ది రోజులుగా ర‌మ‌ణ చంద్ర‌బాబును ప‌ట్టించుకోవ‌డం లేద‌ట‌. గ‌తంలో బాబుతో అనుబంధం ఉన్న నేత‌లు పార్టీ మారిన‌ప్పుడు అమ‌రావ‌తి వ‌చ్చి బాబును క‌లిసి వెళ్లేవారు. ఇప్పుడు ర‌మ‌ణ క‌నీసం బాబుకు ఫోన్ కూడా చేయ‌లేద‌ని పార్టీ నేత‌లే చెప్పుకుంటున్నారు. ఇక ఇదే వ‌రుస‌లో అక్క‌డ మిగిలిన నేత‌లు కూడా కారెక్కే బాట‌లోనే ఉన్నార‌ట‌.

 

మరింత సమాచారం తెలుసుకోండి: