దేశంలో కరోనా జోరు తగ్గినా ఇంకా ముప్పు తొలగిపోలేదు.. కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. అయితే అప్పుడే థర్డ్ వేవ్ వచ్చిందని చెప్పేంతగా మాత్రం కేసులు పెరగడం లేదు. మరి ఇంకా ముప్పు ఎందుకు ఉందని చెబుతున్నామంటే.. ఇంకా దేశంలో వ్యాక్సీన్ ఒక్క డోసు కూడా తీసుకోని వారి సంఖ్య వంద కోట్ల వరకూ ఉంది. ఇప్పటి వరకూ కేవలం 50 కోట్ల డోసులు మాత్రమే దేశంలో పంపిణీ అయ్యాయి. ఇంకా వీటిలో రెండు డోసులు లెక్కలు కలిపి ఉంటాయి.


అయితే.. ఈ వేగంతో టీకాలు వేస్తే మొత్తం దేశానికి టీకాలు వేయాలంటే ఇంకో ఏడాది కాలం పడుతుంది. ఇలా టీకాల ప్రక్రియ ఆలస్యం అయ్యేందుకు అసలు కారణం టీకాలు తగినంతగా లేకపోవడమే.. అందుకే ఇప్పుడు ఇండియా కరోనా టీకాల ఉత్పత్తి పెంచేందుకు మరిన్ని చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే 2021 డిసెంబర్‌ నాటికి కొవిషీల్డ్‌ టీకా ఉత్పత్తి సామర్ధ్యం నెలకు 120 మిలియన్‌ డోసుల కంటే ఎక్కువకు పెంచుతామని చెబుతోంది. ఈ విషయాన్ని  కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ రాజ్యసభలో స్వయంగా తెలిపారు. కొవాగ్జిన్‌ టీకా ఉత్పత్తి సామర్ధ్యాన్ని నెలకు సుమారు 58 మిలియన్‌ డోసులకు పెంచుతామని ఆ మంత్రి సభలో  వెల్లడించారు.


ఈ కోవాగ్జిన్ టీకాల ఉత్పత్తి పెంపు ఆగస్టు నెల నుంచే ప్రారంభం అవుతుందని రాజ్యసభలో లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో వివరించారు. జీవ సాంకేతిక విభాగం కొవిడ్‌ వ్యాక్సిన్‌ అభివృద్ధి కోసం ప్రస్తుతం మిషన్‌ కొవిడ్‌ సురక్ష అనే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ సభకు తెలిపారు. ఈ సురక్ష  మిషన్‌ కింద భారత్‌ బయోటెక్‌, రెండు కేంద్ర ప్రభుత్వ సంస్ధలు, ఓ రాష్ట్ర ప్రభుత్వ సంస్ధకు అదనపు స్ధలాలను కేటాయించారట.


కొవాగ్జిన్‌ టీకా ఉత్పత్తి కోసం హాఫ్‌కైన్‌ బయోఫార్మాసూటికల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌, భారత్‌ ఇమ్యూనలాజికల్స్‌, బయోలాజికల్స్‌ లిమిటెడ్‌కు కేంద్రం సహకారం అందిస్తోందట. అంతే కాకుండా గుజరాత్‌ కొవిడ్‌ వ్యాక్సిన్‌ కన్సార్టియంకు కొవాగ్జిన్‌ సాంకేతికతను బదిలీ చేశారట. ఈ చర్యలతో ఇక టీకాల ప్రక్రియ జోరందుకుంటుందేమో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: