టీడీపీ ప్లస్ బీజేపీ ప్లస్ జనసేన.. ఈ కూటమి గతంలో 2014లో విజయం సాధించింది. అయితే అప్పటి విజయానికి అనేక కారణాలు ఉన్నాయి. అప్పుడే ఏర్పాటైన విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.. అలాంటి రాష్ట్రానికి సీనియర్ నాయకుడే సీఎంగా ఉంటే బావుంటుందన్న అభిప్రాయమే చంద్రబాబును మరోసారి సీఎం చేసిందనేది విశ్లేషకుల మాట. అందులోనూ జగన్ రాజకీయాల్లోకి వచ్చి అప్పటి నాలుగైదేళ్లే అవుతోంది. ఆయనకు ఇంకా అనుభవం కావాలన్న అభిప్రాయం కూడా ఉంది.


మొత్తానికి టీడీపీ, బీజేపీ కూటమి విజయం సాధించింది. అయితే.. బీజేపీతో దోస్తీ కట్టడం ద్వారా కేంద్రం నుంచి భారీగా నిధులు తెచ్చుకోవచ్చన్న చంద్రబాబు ఆశలు మాత్రం నెరవేరలేదు. దీనికి తోడు.. మూడేళ్లలోనే కేంద్రంలో బీజేపీ సర్కారు సరిగ్గా పని చేయట్లేదని.. మళ్లీ మోడీ అధికారంలోకి రావడం కష్టమేనని చంద్రబాబు అభిప్రాయానికి రావడంతో బీజేపీతో దోస్తీను ముగించుకుంది టీడీపీ. రాష్ట్రానికి బీజేపీ ద్రోహం చేసిందన్న నినాదంతో 2019 ఎన్నికలకు వెళ్లింది. కానీ ఆ ఎత్తుగడ పూర్తిగా బెడిసికొట్టింది. మళ్లీ మోడీ పీఎం కాగా.. చంద్రబాబు మాత్రం పరాజితుడయ్యాడు.


ఇప్పుడు మళ్లీ చంద్రబాబు బీజేపీ వైపు చూస్తున్నట్టు కనిపిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన పొత్తును పునరుద్ధరించుకునే ఆలోచనలో టీడీపీ కనిపిస్తోంది. ఎప్పుడూ ఒంటరిగా ఎన్నికలకు వెళ్లే అలవాటు లేని చంద్రబాబు మరోసారి కమలంతో స్నేహం కోసం ప్రయత్నిస్తున్నట్టు కథనాలు వస్తున్నాయి. దీనికి తోడు.. ఇటీవల బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు ఊతమిస్తున్నాయి.  

బీజేపీ.. ఏ పార్టీతో పొత్తు ఉండాలనేది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని.. పార్టీ అధక్షుడు జెపి నడ్డా, తదితర ముఖ్యులు నిర్ణయం తీసుకుంటారని సీఎం రమేశ్ అంటున్నారు. రాజకీయాలలో ఎప్పుడు ఏమైనా జరగవచ్చని... టీడీపీతో బీజేపీ దోస్తీ చేయకూడదని ఏమీ లేదని రమేశ్ అన్నారు. ఆయన ఎలాగూ మాజీ టీడీపీ నాయకుడు కాబట్టి.. టీడీపీ, దోస్తీ కోసం బాగానే ప్రయత్నించే అవకాశం ఉంది. మరి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన ఒక్కటవుతాయా.. అన్నది వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: