కరోనా ప్రపంచం మొత్తాన్ని వణికించింది. ఇప్పటికే రెండు వేవ్‌లు ప్రపంచాన్ని గడగడలాడించాయి. ఇక ఇప్పుడు మూడోవేవ్ ముప్పు కూడా ఒమిక్రాన్ రూపంలో ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే మరి ఇప్పటి వరకూ ప్రపంచంలో అన్ని దేశాల కంటే కరోనాతో ఎక్కువగా నష్టపోయిన దేశం ఏది.. ఈ ప్రశ్నకు సమాధానంగా అమెరికా నిలుస్తోంది. అవును.. ప్రపంచంలోనే ఎక్కువగా కరోనాతో నష్టపోయింది అమెరికానే.


వాస్తవానికి కరోనా వైరస్‌ పుట్టినిల్లు చైనా.. అయినా సరే.. కరోనా ఉద్ధృతికి తీవ్రంగా నష్టపోయింది మాత్రం అమెరికాయే.  అగ్రరాజ్యంగా పేరున్న అమెరికాలో ఇప్పటివరకు 5 కోట్లకుపైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. అంతే కాదు.. అమెరికాలో కరోనా మరణాల సంఖ్య 8 లక్షలు దాటిపోయంది. కరోనా లెక్కలు చూస్తే.. ప్రపంచంలో అత్యధిక కొవిడ్‌మరణాలు అమెరికాలోనే మరి. టీకా రాకముందే కాదు.. టీకా అందరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత అమెరికాలో మరణాల జోరు తగ్గలేదు. టీకా వచ్చిన తర్వాత 2 లక్షలకుపైగా అమెరికన్లు కరోనాతో చనిపోయారు.


వ్యాక్సిన్‌ తీసుకుంటున్నా అక్కడ మరణాలు నమోదవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. కరోనా ఫస్ట్ వేవ్‌లోనే కాదు.. డెల్టా వేరియంట్‌తో వచ్చిన సెకండ్ వేవ్‌లోనూ కుదేలైంది అమెరికానే. తాజాగా ఒమిక్రాన్‌ భయం అమెరికాను వెంటాడుతోంది.


అమెరికాలో కరోనా తెచ్చిన నష్టంపై వాషింగ్టన్ విశ్వవిద్యాలయం పరిశోధన చేసింది. గతేడాది మార్చి నుంచి అమెరికాలో దాదాపు 8లక్షల 80వేల మరణాలు సంభవించాయని ఈ వర్శిటీ నివేదిక చెబుతోంది. విచిత్రం ఏంటంటే.. చాలా మంది అమెరికన్లు ఇంకా వ్యాక్సిన్‌ వేసుకునేందుకు ఆసక్తి చూపడం లేదట. అక్కడ గత ఏడాది డిసెంబరులోనే టీకా అందుబాటులోకి వచ్చింది. అయినా సరే ఇప్పటి వరకు కేవలం 20 కోట్ల మంది మాత్రమే తీసుకున్నారు. ఇంకా దాదాపు 15 కోట్ల మంది టీకాలు తీసుకోవాల్సి ఉంది. అంటే ఆ దేశ జనాభాలో 60 శాతం మాత్రమే టీకాలు తీసుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: