జగన్మోహన్ రెడ్డి ఇదే విధంగా వ్యవహరిస్తుంటే చుక్కలు కనబడటం ఖాయమన్నట్లే ఉంది. ఉద్యోగులతో వివాదాన్ని పెట్టుకోవటం లేకపోతే పెంచుకోవటం వల్ల నష్టమే కానీ ఉపయోగం ఉండదని జగన్ కు ఇంకా అర్ధం కాలేదు. ఉద్యోగులతో పెట్టుకుంటే ఏమవుతుందో చంద్రబాబునాయుడుకి బాగా తెలుసు.  అందుకనే ఉద్యోగులతో కోరి ఏ ప్రభుత్వం కూడా గొడవలు పెట్టుకోదు. వీలుంటే సర్దుబాటు ధోరణితోనే వెళ్ళేందుకు ప్రయత్నిస్తుంది.




తన కళ్ళముందే ఇన్ని ఉదాహరణలు కనిపిస్తున్నా జగన్ మాత్రం ఒంటెత్తు పోకడలతో తన పద్దతిలోనే ఉద్యోగసంఘాల నేతలను డీల్ చేయాలని అనుకుంటున్నారు. పీఆర్సీ, సీపీఎస్ రద్దు డిమాండ్ తో పాటు మరో 70 డిమాండ్లను పరిష్కరించాలని కొద్ది నెలలుగా ఉద్యోగసంఘాలు పదే పదే కోరుతున్న ప్రభుత్వం పట్టించుకోవటంలేదు. పీఆర్సీ ఎంత ఫైనల్ చేస్తారో చెప్పమంటే ఉన్నతాధికారులు చెప్పరు. పీఆర్సీ రిపోర్టు కాపీలను ఇవ్వమంటే ఇవ్వరు. ఎన్ని సమావేశాలు జరిగినా ఔట్ పుట్ అయితే రావటంలేదు.




ఇక్కడ విషయం ఏమిటంటే పీఆర్సీ ఫైనల్ అన్నది సీం చేతిలోనే  ఉంటుంది. నిజంగానే రాష్ట్రంపై ఆర్ధిక భారం ఉందికాబట్టి వీలైనంత తక్కువలో పీఆర్సీ ఫైనల్ చేయాలని జగన్ ఉద్దశ్యం. ఇదే సమయంలో ఎంత వీలైంత అంత ఎక్కువ రాబట్టుకోవాలన్నది ఉద్యోగసంఘాల నేతల ఆలోచన. ఇద్దరి ఆలోచనల్లోను తప్పులేదు. అయితే ఆ విషయం ఏదో స్పష్టంగా తేలాలి. పీఆర్సీ ఇంత అయితేనే ఇవ్వగలమనే విషయాన్ని ఉన్నతాధికారులు ఉద్యోగుసంఘాల నేతలకు స్పష్టంగా చెప్పాలి. నిజానికి ఇదే విషయాన్ని నేతలు సీఎం నోటివెంటే వినాలని కోరుకుంటున్నారు.




ఇదే విషయాన్ని ఉద్యోగసంఘాల నేతలు సీఎంతో భేటీ కావాలని డిమాండ్ చేస్తున్నా జగన్ మాత్రం పట్టించుకోవటంలేదు. ఎప్పుడు జరగాల్సిన ముచ్చట అప్పుడు జరగాలని పెద్దలు చెప్పినట్లుగానే ఎప్పుడివ్వాల్సిన పీఆర్సీని అప్పుడిచ్చేయాలి. ఎప్పటికైనా పీఆర్సీ ఇవ్వకతప్పనప్పుడు ఎంత వీలుంటే అంత తొందరగానే ఇచ్చేస్తేనే మంచిది. ఎక్కువో తక్కువో సంఘాల నేతలతో డైరెక్టుగానే మాట్లాడుకుని వెంటనే పీఆర్సీని ప్రకటించేస్తే సరిపోతుంది. మొదట్లో కాస్త నసిగినా తర్వాత ఉద్యోగసంఘాల నేతలే సర్దుకుంటారు. ఇంతోటి దానికి నేతలను ఊరించి, విసిగించి, సతాయించటం వల్ల ఏమిటి ఉపయోగం.

మరింత సమాచారం తెలుసుకోండి: