లాక్డౌన్ త‌రువాత సోనూసూద్ ఇమేజ్ ఒక్క‌సారి మారిపోయింది.ఆయ‌నేం అన్నా పాటించేందుకు సిద్ధంగా చాలా మంది యువ‌త ఉన్నారు.ముఖ్యంగా ఆయ‌న చేసిన సేవా కార్య‌క్ర‌మాలు అన్నీ బీద‌ల‌కు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి వాళ్ల‌కు బాగా చేరువ‌యి సోనూ ఇమేజ్ ను పెంచాయి.ముఖ్యంగా లాక్డౌన్ లో ఎవ‌రికి ఏ క‌ష్టం వ‌చ్చినా నేనున్నాన్న భ‌రోసాతో సోనూ ప‌నిచేశారు.అది ఆయ‌న‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఏ సినీ హీరో చేయ‌నంత‌గా చేసి ప్ర‌జ‌ల మ‌నసుల్లో సుస్థిర స్థానం అందుకున్నారు.ఈ ఇమేజ్ ను రాజ‌కీయ పార్టీలు వాడుకోవాల‌ని చూసినా కూడా  సోనూ చాలా వ‌ర‌కూ దూరంగానే ఉన్నాడు.తాజాగా కాంగ్రెస్ రాజ‌కీయాల్లో సోనూ ఇరుక్కుపోనున్నాడేమో అన్న సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఆ విధంగా కాకుండా ఉండేందుకు సోనూ ప్ర‌య‌త్నిస్తే మేలు.


మొత్తం 117 అసెంబ్లీ స్థానాల‌కు పంజాబ్ లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. జ‌న‌వ‌రి 15 నోటిఫికేషన్ ఇష్యూ కాగా ఫిబ్ర‌వ‌రి 14న ఎన్నిక‌లు జ‌రుగుతాయి.మార్చి 10 న ఫ‌లితాలు వెల్ల‌డ‌వుతాయి.ఈ ఎన్నిక‌ల‌కు సంబంధించి కాంగ్రెస్,బీజేపీ నువ్వా - నేనా అన్న విధంగా త‌ల‌ప‌డుతున్నాయి. కాంగ్రెస్ కు న‌వ జ్యోత్ సింగ్ సిద్ధూ లాంటి వారున్నా కూడా స్టార్ క్యాంపైన‌ర్ల వేట‌లో ఆ పార్టీ ఉంది.అందుకే సోనూ సూద్ లాంటి వారి సాయం తీసుకోవాల‌ని కోరుకుంటోంది.సోనూ సోద‌రి మాళ‌విక ఇటీవ‌లే కాంగ్రెస్ లో చేరారు. మోగా నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయ‌నున్నారు.కాంగ్రెస్ పార్టీ తొలి విడత‌లో భాగంగా 86మందితో కూడిన జాబితా విడుద‌ల చేసింది. ఇక స్టార్ క్యాంపైన‌ర్ సోనూ గురించే మాట్లాడుకోవాలి.ఆయ‌న కేవ‌లం త‌న చెల్లెలు త‌ర‌ఫునే క్యాంపైనింగ్ చేస్తాన‌ని అంటున్నారు.కానీ కాంగ్రెస్ మాత్రం త‌న ఆలోచ‌న వేరుగా ఉంద‌ని అంటోంది. వీలున్నంత మేర‌కు ఎక్కువ నియోజ‌క‌వ‌ర్గాల్లో సోనూ ఇమేజ్ ను వాడుకోవాల‌ని చూస్తోంది.అయితే రాజ‌కీయ పార్టీల అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఉప‌యోగ‌ప‌డే క‌న్నా సోనూ త‌న‌ని తాను ఒకే ఒక్క నియోజ‌క‌వ‌ర్గానికి ప‌రిమితం చేసుకుంటే మేలు అన్న సూచ‌న‌లూ వినిపిస్తున్నాయి.
మరింత సమాచారం తెలుసుకోండి: