జనసేన సోషల్ మీడియా విభాగం ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికీ తెలుసు. పార్టీ తరపున అధికారిక అకౌంట్లే కాకుండా.. అభిమానుల అకౌంట్లు ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటాయి. జనసేనానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు, ఏ చిన్న అప్డేట్ అయినా సోషల్ మీడియాలో క్షణాల్లో పాపులర్ అవుతుంది, ట్రెండింగ్ లో ఉంటుంది. సహజంగా సినిమా హీరోలకు మినహా, రాజకీయ నాయకులకు సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్లు ఇంత ఫాస్ట్ గా రియాక్ట్ కావు, కానీ ఇక్కడ పవన్ కల్యాణ్ హీరో కమ్ పొలిటీషియన్ కావడంతో అటు ఫ్యాన్ బేస్, ఇటు కార్యకర్తల బలం రెండూ ఆయనకు ఉన్నాయి. అవన్నీ సోషల్ మీడియాలో బాగా ప్రతిబింబిస్తాయి.

కన్నాభాయ్ తర్వాత..
అయితే కన్నాభాయ్ అనే అకౌంట్ తో సీఎం జగన్ పై అనుచిత పోస్ట్ లు పెట్టిన ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత వ్యవహారంలో తేడా వచ్చింది. కన్నాభాయ్ గతంలో జనసేనకు అనుకూలంగా పోస్ట్ లు పెట్టేవారు. దీంతో కన్నాభాయ్ కి జనసేనకు సంబంధం ఉందనేది వైసీపీ వర్గం వాదన, కానీ జనసేన దీనిపై క్లారిటీ ఇచ్చింది. అసలు కన్నాభాయ్ అకౌంట్ తో తమకు సంబంధం లేదని, ఆ అకౌంట్ ని వచ్చిన పోస్ట్ లకు తమకు సంబంధం లేదని తేల్చి చెప్పింది. అదే సమయంలో నిజమైన జనసైనికులు అలాంటి పోస్టింగ్ లు పెట్టరని కూడా క్లారిటీ ఇచ్చింది.

వాస్తవానికి కన్నాభాయ్ అకౌంట్ బ్లాక్ కావడం, ఆ పేరుతో పోస్ట్ లు పెట్టిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో సోషల్ మీడియాలో జనసేన జోరు కాస్త తగ్గింది. జనసేన కార్యకర్తల అకౌంట్ల నుంచి గతంలో ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించిన పోస్ట్ లు కూడా ఇప్పుడు డిలీట్ అవుతున్నాయని అంటున్నారు. పోనీ డిలీట్ కాకపోయినా, ఇకపై మరీ అంత జోరుగా పోస్టింగ్ లు పడవు అనేది మాత్రం అర్థమవుతోంది. సోషల్ మీడియా తిట్లపై కూడా పోలీసులు నిఘా పెట్టారు. బహిరంగ వేదికలపై, ఇతరత్రా మాధ్యమాల్లో ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తుల్ని కించపరుస్తూ పోస్టింగ్ లు పెడితే వదిలిపెట్టే ప్రసక్తే లేదంటున్నారు పోలీసులు. సోషల్ మీడియాలో ఎవరో తెలియకుండా పోస్ట్ లు పెట్టాలనుకున్నా, అలా చేసినా కూడా ఇప్పుడు పట్టుకోవడం చాలా సులభం. అందుకే విమర్శలతో పోస్టింగ్ లు పెడుతూ.. పాపులర్ అవుతున్న సోషల్ మీడియా అకౌంట్లు ఇక కాస్త సైలెంట్ అయ్యే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: