
ఉత్తరాంధ్ర జిల్లాలు అయిన విజయనగరం మరియు శ్రీకాకుళం జిల్లాల వరప్రదాయిని తోటపల్లి ప్రాజెక్టు.నాగావళి నదిపై నిర్మించిన ఈ ప్రాజెక్టు ఆధునికీకరణకు వైఎస్సార్ తాను ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలయజ్ఞంలో నిధులిచ్చారు.మొత్తం ఆయుకట్టు లక్ష ఎకరాలకు పైగానే,ఆధునికీకరణ పనులు చేపడితే ఇంకాస్త పెరిగేందుకు అవకాశాలున్నాయి.ఆ రోజు చేపట్టిన పనులు ఇంకా పూర్తికాలేదు.ముఖ్యంగా కాల్వల నిర్వహణ అస్సలు బాలేదు.మొన్నటి వేళ కాల్వల నిర్వహణకు, చిన్న చిన్న మరమ్మతులకు సీఎం జగన్ నిధులు మంజూరు చేశారు. కరోనా కారణంగా ఏ ప్రాజెక్టు నిర్వహణ కూడా ఉత్తరాంధ్ర జిల్లాలో సరిగా చేపట్టలేదు అన్నది ఓ విమర్శ.ఇదే వాస్తవం కూడా! కానీ ఇప్పుడు తోటపల్లి పనులకు ఇంకాస్త ఊపిరి వచ్చింది.తోటపల్లి కాలువ పనులకు సంబంధించి మంత్రి బొత్స దృష్టి సారించారు.నిధులు కూడా ఇప్పించారు.దీంతో పెండింగ్ లో ఉన్న కాల్వ పనులను ఏడాదిలోగా పూర్తి చేస్తామని మంత్రి బొత్స ఘంటాపథంగా చెబుతున్నారు.
వాస్తవానికి అటు తోటపల్లికి కానీ ఇటు వంశధారకు కానీ కేంద్రం తరఫున నిధులు అందేందుకు వీలే లేకుండా ఉంది.గత ప్రభుత్వ హయాంలో కూడా ఇవే సమస్యలు ఉన్నాయి.అప్పట్లో బీజేపీ సర్కారుకూ, చంద్రబాబుకూ స్నేహం చెడడంతో ప్రాజెక్టు పనుల పరిశీలనకు బీజేపీ నాయకురాలు పురంధరి వచ్చారు.ఇదే సమయంలో వంశధార పనులు చూశాక,తోటపల్లికి వెళ్లకుండా వెళ్లిపోయారు.ఆ రోజు ఓ స్థానిక పత్రికలో చిన్నమ్మా..తోటపల్లిని మరిచారా ! అన్న శీర్షికతో ప్రచురితం అయిన కథనంపై బీజేపీ వర్గాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి.
వాస్తవాలు వదిలి రాజకీయం చేయడం తగదంటూ ఆ రోజు వెలువడిన కథనం రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో చర్చకు తావిచ్చింది.తోటపల్లి పనులకు సంబంధించి కనీస మరమ్మతులకు సంబంధించి నాబార్డు వంద కోట్ల రూపాయల నిధులు కూడా ఇచ్చేందుకు ఆ రోజు ముందుకు రాని కారణంగా చాలా సమస్యలు క్షేత్ర స్థాయిలో నెలకొన్నాయి. నిధులు లేమి కారణంగా అప్పుడే రాజధాని నిర్మాణానికే బాబు అండ్ కో పూర్తి శ్రద్ధ పెట్టడంతో ఈ ప్రాజెక్టు పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.ఇప్పుడు కొంత కదలిక వచ్చింది.వంశధార ప్రాజెక్టు పనులకు కూడా మరో ఏడాదిలో పూర్తి స్థాయి ముగింపు దక్కనుందనే తెలుస్తోంది.ఈ రెండూ పూర్తయితే మూడు లక్షలకు పైగా ఎకరాలు సస్య శ్యామలం అవుతాయి.చివరి ఆయకట్టు వరకూ నీరందేందుకు అవకాశాలు పుషల్కంగా ఉంటాయి.రెండు పంటలు పండుతున్న దశలో మరో పంటకు కూడా అవకాశం ఉండడమే కాదు గోదావరి జిల్లాలతో శ్రీకాకుళం జిల్లా సాగు విషయమై పోటీ పడేందుకు ఆస్కారం ఉంటుందన్న నాటి వైఎస్సార్ మాట నిజం అయ్యేందుకు ఆస్కారం ఉంటుంది.