ఏపీ కొత్త కేబినెట్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతోంది. ఇవాళ వెలగపూడిలోని సచివాలయంలో మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. సరిగ్గా ఉదయం 11.31 గంటలకు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభం అవుతుంది. సచివాలయం పక్కన ఉన్న పార్కింగ్‌ స్థలంలో ప్రమాణ స్వీకారం కార్యక్రమం నిర్వహిస్తారు. జగన్ కొత్త టీమ్‌ మొత్తం 25 మందితో రెడీ అయ్యింది. జగన్ పంపిన మంత్రుల జాబితాకు గవర్నర్ నిన్న ఆమోదం తెలిపారు.


జగన్ కొత్త టీమ్‌లో పాత కేబినెట్‌లోని 11 మందికి మళ్లీ అవకాశం లభించింది. బొత్స, పెద్దిరెడ్డి, నారాయణ స్వామి, ఆంజాద్‌ బాషా, బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, గుమ్మనూరి జయరాం, ఆదిమూలపు సురేశ్‌, సీదిరి అప్పలరాజు, పినిపె విశ్వరూప్, వేణుగోపాలకృష్ణ, తానేటి వనిత వంటి 11 మంది మళ్లీ అవకాశం దక్కించుకున్నారు. ఇక మిగిలిన వాళ్లంతా కొత్త వాళ్లే.. వాళ్లు ఎవరంటే.. పీడిక రాజన్నదొర, ధర్మాన ప్రసాదరావు, గుడివాడ అమర్‌నాథ్‌, ముత్యాలనాయుడు, దాడిశెట్టి రాజా, కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ, జోగి రమేశ్‌, అంబటి రాంబాబు, విడదల రజని, మేరుగ నాగార్జున, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, రోజా, ఉషశ్రీ చరణ్‌.. ఇదీ జగన్ కొత్త టీమ్.


మొత్తం 25 మందితో ఏపీ కొత్త కేబినెట్ కొలువు తీరనుంది. సీఎం సూచనతో గవర్నర్ మంత్రులకు శాఖలు కేటాయించనున్నారు. మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం దృష్ట్యా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సచివాలయానికి దారితీసే మార్గాల్లో ఆంక్షలు విధించారు. ప్రకాశం బ్యారేజీ ఆనుకుని ఉన్న కరకట్ట రోడ్టుపై ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.


ఇదే సమయంలో మంత్రి వర్గంలో పదవులు దక్కిని కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణపై వైసీపీలో అసమ్మతి వ్యక్తమైంది. పదవులు ఆశించి భంగపడిన నేతలు, వారి అనుయాయుల  ఆందోళనలు చేశారు. ఆత్మహత్యయత్నాలు, రాస్తారోకోలు, ధర్నాలు చేశారు.
రెండోసారి మంత్రిగా అవకాశం ఇవ్వకపోవటంపై బాలినేని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్సీ మంత్రులను కొనసాగించి తనను తప్పించడంపై సుచరిత మనస్తాపం చెందారు. ఆమె  ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని ఆమె కుమార్తె ప్రకటించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: