ఇటీవల కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కేంద్రంలో ప్రత్యమ్నాయ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు టీఆర్ఎస్ ముందుంటుందని అన్నారు. ఆ క్రమంలో అన్ని రాష్ట్రాలను చుట్టి వచ్చారు, అన్ని రాష్ట్రాల ముఖ్య నేతలతో ఆయన సమావేశమ్యయారు. అయితే ఆ తర్వాత కేసీఆర్ కాస్త సైలెంట్ అయ్యారు. యాసంగి ధాన్యం కొనాలంటూ కేంద్రతో కొట్లాటకి దిగిన కేసీఆర్ ఆ తర్వాత ఆయనే వెనక్కు తగ్గారు. తెలంగాణ ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుందని చెప్పారు. దీంతో కేసీఆర్ కాస్త వెనక్కి తగ్గినట్టయింది.

మోదీకి గట్టిగా కౌంటర్లు ఇస్తున్న కేటీఆర్..
కేసీఆర్ వెనక్కి తగ్గిన తర్వాత కేటీఆర్ లైన్లోకి వచ్చారు. కేటీఆర్ నేరుగా మోదీని టార్గెట్ చేశారు. గ్యాస్ రేట్లపై గట్టిగా కౌంటర్లు ఇస్తున్నారు. గతంలో 400 రూపాయలున్న గ్యాస్ సిలిండర్ ఇప్పుడు వెయ్యి రూపాయలు దాటిందని అన్నారు కేటీఆర్. పెట్రోల్ రేటు 120 రూపాయలకు చేరుకుందని, ఎయిరిండియా, ఎల్ఐసీని అమ్మకానికి పెట్టారని మండిపడ్డారు. బేజేపీ అంటే బేచో జనతాకి ప్రాపర్టీ అంటూ ఎద్దేవా చేశారు కేటీఆర్. అంతకు ముందు ఎన్డీఏ సర్కారు ఎన్పీఏ సర్కారంటూ మండిపడ్డారు. నాన్ ప్రాఫిటబుల్ అసెట్స్ పార్టీ అంటూ ఎన్డీఏకి కొత్త అర్థం చెప్పారు.

నల్లధనం వెలికి తీస్తానంటూ గొప్పలు చెప్పుకున్న ప్రధాని మోదీ మాటలు అంతాబూటకం అంటూ మండిపడ్డారు కేటీఆర్. ప్రజలందరికీ ఒక్కొకరి ఖాతాల్లో 15 లక్షల రూపాయలు వేస్తామన్న ప్రధాని మోదీ, ఎవరికైనా అలా ఆర్థిక సాయం చేశారా అని ప్రశ్నించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని బూటకపు మాటలు చెప్పారని అన్నారు. అచ్చేదిన్ ఆయేగా అంటే ఇదేనా అని మండిపడ్డారు కేటీఆర్. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రూపాయి పతనం చెందిందని, ఇది చేతకాని నాయకత్వం వల్లేనని మండిపడ్డారు కేటీఆర్. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడుస్తున్నా దేశంలో సౌకర్యాలు లేని గ్రామాలు చాలానే ఉన్నాయని అన్నారు. అమెరికా తలసరి ఆదాయం 60వేల డాలర్లు ఉంటే మన దేశ ఆదాయం కేవలం 1800 డాలర్లు మాత్రమేనంటున్నారు కేటీఆర్. కులం, మతం పేరిట పంచాయితీలు పెట్టుకుంటూ.. మన పిల్లలు కొట్లాడుకునే పరిస్థితి తెచ్చారని అన్నారు. దేశానికి సమర్థమైన నాయకత్వం అవసరం అని అన్నారు కేటీఆర్. మొత్తమ్మీద.. విమర్శల పర్వాన్ని కేసీఆర్ ఆపేస్తే.. కేటీఆర్ దాన్ని కొనసాగిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: