తెలుగుదేశంపార్టీకి గడచిన రెండు ఎన్నికల్లో మూడు సామాజికవర్గాలు చాలా దూరంగా జరిగాయి. ఎంతదూరంగా జరిగాయంటే టీడీపీ తరపున గెలుపు దక్కనంత దూరంగా వెళ్ళిపోయాయి. ఇంతకీ విషయం ఏమిటంటే రాష్ట్రంలో బలమైన ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటిలు తెలుగుదేశంపార్టీ నుండి డిటాచ్ అయిపోయాయి. రెండువరస ఎన్నికలు అంటే 2014, 19 లో పై వర్గాల నుండి గెలిచిన ఎంఎల్ఏలు పెద్దగా లేరు.





ఎస్సీలు, ఎస్టీల నియోజకవర్గాలు రాష్ట్రంలో 36 ఉన్నాయి. వీటిల్లో ఎస్సీ నియోజకవర్గాలు 29, ఎస్టీ నియోజకవర్గాలు ఏడున్నాయి. ఇవికాకుండా ముగ్గురు ముస్లిం మైనారిటీ ఎంఎల్ఏలున్నారు. ఎస్సీ ఎంఎల్ఏల్లో ప్రస్తుతం టీడీపీ తరపున కేవలం ఒక్కరు మాత్రమే గెలిచారు. మిగిలిన 28 నియోజకవర్గాల్లోనూ వైసీపీ అభ్యర్ధులే గెలిచారు. 2014 ఎన్నికల్లో కూడా అత్యధిక ఎస్సీ నియోజకవర్గాలు వైసీపీ ఖాతాలోనే ఉన్నాయి. అంటే ఎస్సీలు టీడీపీకి బాగా దూరమైపోయినట్లే అర్ధమవుతోంది.





సరిగ్గా ఇక్కడే చంద్రబాబునాయుడు ఒక వ్యూహం ఆలోచించారట. అదేమిటంటే బీఎస్పీతో పొత్తు పెట్టుకోవటం. వచ్చే ఎన్నికల్లో ఎస్సీ ఓట్లలో చీలికతెచ్చి ఎంత వీలైతే అన్ని ఓట్లు తెలుగుదేశంపార్టీకి పడేట్లుగా ప్లాన్ చేస్తున్నారట. ఇందులో భాగంగానే బీఎస్పీకి ఓ ఐదో పదో అసెంబ్లీ సీట్లను ఇవ్వాలని అనుకున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. మరి బీఎస్పీకి ఇవ్వాలని అనుకున్న సీట్లు రిజర్వుడు నియోజకవర్గాలేనా లేకపోతే ఓపెన్ కేటగిరీ సీట్లు కూడా ఇవ్వబోతున్నారా అనేది తెలీదు.





రాష్ట్రం మొత్తంమీద బీసీ ఓట్ల తర్వాత ఎక్కువగా ఉన్నది ఎస్సీ ఓట్లే అన్న విషయం అందరికీ తెలిసిందే. బీసీ ఓట్లు టీడీపీ నుండి చీలిపోయి వైసీపీకి వెళుతున్నాయి. కాబట్టి ఎస్సీ ఓట్లలో చీలికతెచ్చి వైసీపీ నుండి  తమవైపుకు లాక్కోవాలన్నది చంద్రబాబు వ్యూహంగా కనబడుతోంది. ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటి ఓట్లు కాంగ్రెస్ ఓటుబ్యాంకన్న విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన పరిణామాల్లో పై మూడు సామాజికవర్గాలు కాంగ్రెస్ నుండి వైసీపీ వైపు షిఫ్టయ్యాయి. మరి ఎస్సీ ఓట్లకోసం చంద్రబాబు వేస్తున్న ప్లాన్ ఎంతవరకు వర్కవుటవుతుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: