ఢిల్లీ లిక్కర్ స్కామ్ డెవలప్మెంట్లు చూస్తుంటే కేసీయార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నట్లే అనుమానంగా ఉంది. తాజాగా ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, వైసీపీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డితో పాటు కల్వకుంట్ల కవిత కూడా ఉన్నారు. కవిత అంటే కేసీయార్ కూతురన్న విషయం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.లిక్కర్ స్కామ్ లో కవిత పాత్ర కూడా ఉన్నట్లు చాలాకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఎప్పటికప్పుడు ఆమె ప్రచారాన్ని ఖండిస్తునే ఉన్నారు. చివరకు కవిత పాత్ర ఉన్నట్లు ఈడీ చార్జిషీటు ద్వారా అర్ధమవుతోంది. ఇంతకాలం ఆమె కేవలం బుకాయించినట్లు మాత్రమే తెలుస్తోంది. చార్జిషీట్లో కవిత పేరుంది కాబట్టి ఏదోరోజు హఠాత్తుగా అరెస్టు చేసినా చేయచ్చు. చార్జిషీట్లో కేజ్రీవాల్, మాగుంట పేర్లున్నప్పటికీ కవిత మాత్రమే కీలకంగా మారారు. ఎందుకంటే బీజేపీ ప్రధాన టార్గెట్ తెలంగాణా మాత్రమే కాబట్టి.


వచ్చేఎన్నికల్లో బీఆర్ఎస్ స్పీడుకు బ్రేకులు వేయాలంటే ఏదో పద్దతిలో కంట్రోల్ చేయాలన్నది బీజేపీ వ్యూహంగా కనబడుతోంది. ఆ ఏదో పద్దతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే కవితను రెండుసార్లు ఈడీ విచారించింది. అయితే మూడోసారి విచారణకు కవితను ఈడీ ఢిల్లీకి పిలిపించే అవకాశాలున్నాయని సమాచారం. అప్పుడు విచారణ సందర్భంగా అరెస్టు చేసే అవకాశాలను తోసిపుచ్చేందుకు లేదు.


లిక్కర్ స్కామ్ లో కవితను అరెస్టు చేయటం ద్వారా కేసీయార్ జోరుకు కళ్ళెం వేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందనే ప్రచారం ఎప్పటినుండో జరుగుతోంది. ఆ ప్రచారం తొందరలోనే నిజమైనా ఆవ్చర్యపోవక్కర్లేదు. రాబోయే తెలంగాణా ఎన్నికల్లో లిక్కర్ స్కామ్ లో కవిత పాత్రను బాగా ప్రచారం చేసి కేసీయార్ పాలనకు నెగిటివ్ షేడ్ అద్దాలన్నది బీజేపీ ఆలోచనగా కనబడుతోంది. ఎలాగంటే స్కామ్ లో కవిత తగులుకున్నారంటే వెనకాల కేసీయార్ అండలేకుండా ఉండదు అనే విషయాన్ని జనాల్లో బాగా ప్రచారం చేయాలన్నది బీజేపీ ఆలోచనగా కనబడుతోంది.  మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: