ఎంఎల్ఏ కోటా ఎంఎల్సీ ఎన్నికల వల్ల వైసీపీకి మంచే జరిగిందా ? పార్టీలో ఇపుడిదే చర్చ జరుగుతోంది. ఎంఎల్సీ ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయించిన ఏడుగురు అభ్యర్ధుల్లో ఒక్కళ్ళు ఓడిపోయిన విషయం తెలిసిందే. టీడీపీకి బలముండి అభ్యర్ధిని గెలిపించుకోలేదు. వైసీపీ ఎంఎల్ఏలను ప్రలోభాలకు గురిచేయటం ద్వారా నాలుగు ఓట్లను లాక్కుని గెలిచింది. అంటే వైసీపీ నుండి టీడీపీ అభ్యర్ధికి నలుగురు ఎంఎల్ఏలు క్రాస్ ఓటింగ్ చేయటం వల్ల మాత్రమే టీడీపీ అభ్యర్ధి పంచుమర్తి అనూరాధ గెలిచారు.





ఫలితాలు వచ్చిన తర్వాత క్రాస్ ఓటింగ్ చేసిన నలుగురు ఎంఎల్ఏలు ఎవరనే విషయం తెలిసిపోయింది. అంతర్గత విచారణ చేసుకున్న తర్వాతే ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధరరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలపై సస్పెన్షన్ వేటుపడింది. ఇక్కడ వైసీపీకి జరిగిన మంచి ఏమిటంటే వైసీపీలో ఉంటూ టీడీపీకి మద్దతిచ్చే ఎంఎల్ఏలు ఎవరనే విషయం తాజాగా బయటపడింది. జగన్మోహన్ రెడ్డితో విభేదించిన కారణంగా ఇద్దరు ఎంఎల్ఏలు ఆనం, కోటంరెడ్డి రెబల్ ఎంఎల్ఏలుగా తయారయ్యారు.





వీళ్ళు ఎలాగూ వైసీపీ అభ్యర్ధులకు ఓట్లేయరని అందరు అనుకుంటునే ఉన్నారు. అయితే వీళ్ళతో పాటు మేకపాటి, ఉండవల్లి కూడా టీడీపీకి ఓట్లేశారు. దీంతోనే నలుగురు ఎంఎల్ఏలు జగన్ను దెబ్బకొట్టటానికి వెనకాడలేదన్న విషయం స్పష్టమైంది. జగన్ను దెబ్బకొట్టేది ఎవరనే విషయం సాధారణ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నపుడే బయటపడింది.






ఇపుడు జగన్ జాగ్రత్తపడాల్సిన విషయం ఏమిటంటే  పార్టీలో ఇలాంటి అసంతృప్తులు ఇంకా ఎంతమంది ఉన్నారనే విషయమై ఒకటికి పదిసార్లు క్రాస్ చెక్ చేసుకోవాల్సిందే. 16 మంది ఎంఎల్ఏలతో చంద్రబాబు ఫోన్లో మాట్లాడారనే ప్రచారం జరుగుతోంది. వచ్చేఎన్నికల్లో ఎంతమందికి జగన్ టికెట్లిస్తారనే విషయాన్ని పక్కనపెట్టేస్తే ముందు అసంతృప్తులను గుర్తించటం చాలా అవసరం. ఇపుడు పై నలుగురు మాత్రమే క్రాస్ ఓటింగుకు పాల్పడ్డారు. అయితే అసంతృప్తిగా ఉన్న ఎంఎల్ఏలు ఇంకా చాలామందే ఉన్నరనే ప్రచారం బాగా జరుగుతోంది. కాబట్టి జగన్ వెంటనే దీనిపై దృష్టిపెట్టి సమస్యలు పరిష్కారానికి చొరవ తీసుకోవాలి. ఏదేమైనా టీవీ ప్రకటనలో చెప్పినట్లు ‘మరక మంచిదే’ అన్నట్లుగా ముందు జాగ్రత్తలు అవసరం.




మరింత సమాచారం తెలుసుకోండి: