ఏమో గ్రౌండ్ లెవల్లో జరుగుతున్నది చూస్తుంటే ఇదే అనుమానం పెరుగుతోంది. పొదుపు సంఘాల్లోని అక్క, చెల్లెమల్ల ఖాతాల్లో వైఎస్సార్ ఆసరా పథకంలో నిదులు జమయ్యాయి. పొదుపు సంఘాలకు సంబంధించిన చెక్కులను నియోజకవర్గాల్లో మంత్రులు, ఎంఎల్ఏలు మహిళలకు పంపిణీచేశారు. నియోజకవర్గంలో పొదుపు సంఘాలకి సంబంధించిన మహిళలతో సమావేశం నిర్వహించి చెక్కుల పంపిణీ కార్యక్రమం పెద్దఎత్తున జరిగింది. ఈ కార్యక్రమం వల్ల ఏమి తెలిసిందంటే తమ ఎంఎల్ఏని జనాలందరు చూడగలిగారు.

ఇప్పటివరకు జరిగింది ఏమంటే పథకం ఏదైనా కానీండి ఎక్కడో ఒకచోట బహిరంగసభ నిర్వహించేవారు. ఆ బహిరంగసభకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యఅతిధిగా హాజరయ్యేవారు. ఆ కార్యక్రమంలో జగన్ బటన్ నొక్కటం, నిధులు లబ్దిదారుల ఖాతాల్లో జమైపోవటం. గడచిన మూడున్నరేళ్ళుగా జరుగుతున్నది ఇదే. అయితే ఈ విధానాన్ని మంత్రులు, ఎంఎల్ఏలు వ్యతిరేకిస్తునే ఉన్నారు. జగన్ అనుసరిస్తున్న పద్దతి వల్ల జనాల్లో తమకు గుర్తింపులేకుండా పోతోందని మొత్తుకుంటున్నారు.

అయినా జగన్ ఎవరినీ లెక్కచేయలేదు. అలాంటిది ఇపుడు వైఎస్సార్ ఆసరా కార్యక్రమం  ప్రతి నియోజకవర్గంలో జరగటం, మంత్రులు, ఎంఎల్ఏలు హాజరవ్వటంతో జనాలకు కూడా తమ ఎంఎల్ఏని కలిసినట్లుగా ఉంది. ఇదే సమయంలో జనాలందరినీ కలవటం ఎంఎల్ఏలకు కూడా గుర్తింపు లభించినట్లయ్యింది. పొదుపు సంఘాల మహిళలు ఎంఎల్ఏ చేతుల మీదుగా చెక్కులు తీసుకోవటం అన్న ఫీలింగే వేరుగా ఉంటుంది. ఇదే సమయంలో మహిళలకు తమ చేతుల మీదుగా చెక్కుల పంపిణీ చేయటం ఎంఎల్ఏలకు కూడా హ్యాపీనే.

ఇదంతా ఎందుకు జరిగిందంటే మొన్నటి పట్టభద్రుల ఎంఎల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధులు ఓడిపోయిన కారణమే అయ్యుండచ్చు. జనాల్లో ఎంఎల్ఏలకు గుర్తింపు లేకపోతే రేపటి ఎన్నికల్లో ప్రచారం మాటేమిటి ?  జనాలను పోలింగ్ కేంద్రాలకు ఎవరు తీసుకురావాలి ?  ఓట్లు ఎవరు వేయించాలి ? పథకాల అమలులో అవినీతి జరగటంలేదన్న మాట వాస్తవమే. కానీ ఎంఎల్ఏలకు కూడా జనాల్లో గుర్తింపుండాలి కదా. మరీ ఎంఎల్ఏలను డమ్మీలుగా చేసేస్తే అంతిమంగా నష్టపోయేది తానే అన్న విషయాన్ని జగన్ ఇప్పటికైనా గ్రహించినట్లున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: