ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒకపార్టీపై మరొక పార్టీ విరుచుకుపడుతూ ప్రచారం పూర్తి చేశారు. కాంగ్రెస్ వాళ్లు బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనంటూ ప్రచారం చేశారు. బీజేపీ మాత్రం బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని అన్నారు. ఇక బీఆర్ఎస్ అయితే ఏకంగా జాతీయ స్థాయిలో ప్రత్యర్థులైన కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటే అని ఇలా ఒకరిపై ఒకరు ఆరోపించారు.


అయితే నిన్న మొన్నటి వరకు తెలంగాణలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా మేమే అని రానున్నది బీజేపీ ప్రభుత్వమే అని చెప్పుకున్న కమలనాథులు అసలు దశలో చేతులెత్తేశారా అనే ప్రశ్న తలెత్తుతోంది. బీజీపీ, బీఆర్ఎస్ ఒకటే అని ప్రజలు భావిస్తున్న సమయంలో ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలు వాటికి బలాన్ని చేకూరిస్తున్నాయి. అరవింద్ చేసిన అనూకూల వ్యాఖ్యలు చూస్తుంటే తెరవెనుక ఏదో జరుగుతుందన్న అనుమానాలు కలుగుతున్నాయని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.


ఇటీవల ఆయన రేవంత్ తో పోలిస్తే సీఎం కేసీఆర్ బెటర్ అని.. తెలంగాణ కోసం కేసీఆర్ పోరాడినప్పుడు రేవంత్ టీడీపీలో ఉన్నారంటూ చేసిన వ్యాఖ్యలు బీజేపీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త చర్చకు దారి తీశాయి. ఎన్నికలకు ముందే బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఒప్పందం కుదిరింది అని అందుకే బయటకు వస్తున్నామని బీజేపీ నేతలు ప్రకటిస్తూ కాంగ్రెస్ లో చేరుతున్న సందర్భంలో అరవింద్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే బీజేపీ సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నట్లే కనిపిస్తుంది.


ఎన్నికల ముందే బీజేపీ కాడి వదిలేసి బీఆర్ఎస్ తో పొత్తు కోసం ప్రయత్నిస్తుందా అన్న అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆరోపణలను ప్రజల కూడా నమ్ముతున్న వాతావరణం కనిపిస్తోంది. ఇప్పుడు ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలు చూస్తుంటే బీజేపీకి లేకుంటే బీఆర్ఎస్ కు ఓటేయాలి అన్నట్లు ఉన్నాయి. హంగ్ ఏర్పడుతుందని బీజేపీ చెప్తున్న నేపథ్యంలో ఫలితాల తర్వాత బీజేపీ, బీఆర్ఎస్ కలుస్తాయా అనే కొత్త ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. ఏది ఏమైనా ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ధర్మపురి వ్యాఖ్యలు మాత్రం బీజేపీని ఇరకాటంలో పెట్టేవే.

మరింత సమాచారం తెలుసుకోండి: