ముఖ్యమైన పోలింగ్ ఘట్టం ముగిసింది. ఇక తేలాల్సింది ఫలితాలు మాత్రమే. ఇందుకు 3వ తేదీవరకు వెయిల్ చేయాల్సిందే. 30వ తేదీ పోలింగ్ ముగిసిన తర్వాత మొదలైన ఎగ్జిట్ పోల్స్ జోస్యాలతో జనాల్లో అయోమయం పెరిగిపోతోంది. కారణం ఏమిటంటే ఇటు మంత్రి కేటీయార్ అటు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇద్దరూ అధికారంలోకి రాబోయేది తామేనంటే కాదు కాదు తామే అంటు ప్రకటనలు చేస్తుండటమే.





ఎగ్జిట్ పోల్స్ లో మెజారిటి సంస్ధలు అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్ పార్టీయే అని జోస్యాలు చెప్పాయి. అయితే వీటిని కేటీయార్ కొట్టిపారేస్తున్నారు. పైగా ప్రభుత్వం ఏర్పాటుకు ముహూర్తం కూడా పెట్టేసుకున్నారట. 7వ తేదీన సెక్రటేరియట్ లోనే కేసీయార్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు పార్టీవర్గాలు చెప్పాయి. ముహూర్తం విషయాన్ని కేటీయార్ చెప్పకపోయినా 70 స్ధానాలతో బీఆర్ఎస్ అధికారంలోకి రావటం మాత్రం ఖాయమని చెప్పారు. 2018లో కూడా బీఆర్ఎస్ ఓడిపోతుందని చాలా సంస్ధలు ఎగ్జిట్ పోల్స్ లో చెప్పిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు.





కాబట్టి నేతలు, క్యాడర్ ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదని కేటీయార్ భరోసా ఇచ్చారు. ఇదే సమయంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఖాయమనే ధీమాను వ్యక్తంచేస్తున్నారు. 9వ తేదీన ఉదయం 10.30 గంటలకు ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయటం ఖాయమంటున్నారు. ఈ విధంగా రెండువైపులా ప్రభుత్వాలు ఏర్పాటుచేయటంలో ఫుల్  కాన్ఫిడెన్ప్ తో కనిపిస్తుండటంతో మధ్యలో  జనాల్లో అయోమయం పెరిగిపోతోంది. మధ్యేమార్గంగా హంగ్ అసెంబ్లీ వచ్చే అవకాశముందనే ప్రచారాన్ని కూడా కొందరు ప్రస్తావిస్తున్నారు.





ఎగ్జిట్ పోల్స్ ప్రకారమైతే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే జనాలు నమ్ముతున్నారు. అయితే కేటీయార్ లోని ఆత్మవిశ్వాసం చూసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ జోస్యాలన్నీ నిజమవ్వాలని లేదు కదా అన్న చర్చలు కూడా జనాల్లో  పెరిగిపోతున్నాయి. మామూలుగా అయితే ఇలాంటి అయోమయ పరిస్ధితి కనబడటం తక్కువనే చెప్పాలి. కానీ ఇపుడు జరిగిన ఎన్నికలు మాత్రం చాలా ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. అందుకనే పార్టీ నేతల్లాగే జనాలు కూడా ఏ విషయాన్ని స్పష్టంగా చెప్పలేకపోతున్నారు.







మరింత సమాచారం తెలుసుకోండి: