2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం దేశ రాజకీయం పూర్తిగా మారిపోయింది. మెజారిటీకి తక్కువగా ఉన్న బీజేపీ, మిత్రపక్షాల సహకారంతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే, ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో మిత్రపక్షాలపై ఆధారపడింది. అందుకే, ఇప్పుడు బీజేపీ ఓ రకంగా ఆచీ తూచీ అడుగులు వేస్తోంది. ముఖ్యంగా టీడీపీ, జేడీయూలు బీజేపీకి ఒక ఊతకర్రలా మారిన వాస్తవం అంద‌రికి తెలిసిందే. ఈ నేపథ్యంలో జేడీయూ అధినేత నితీష్ కుమార్‌కు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వబోతున్నారన్న వార్తలు రాజకీయ వర్గాల్లో గట్టిగానే వినిపిస్తున్నాయి. బీహార్‌ వంటి కీలక రాష్ట్రంలో ఎన్డీయే పట్టు తక్కువవుతున్న తరుణంలో, నితీష్ కుమార్‌ను కట్టిపడేయాలంటే ఇటువంటి కీలకమైన రాజ్యాంగ పదవి అనివార్యం. గతంలో ఎన్నో మార్లు కూట‌మిలు మార్చిన నితీష్, ఈసారి మాత్రం బీజేపీ కూటమికి కట్టుబడి ఉండాలని భావించినట్లున్నారు.
 

ఇది జేడీయూకి ఎంతో ప్రతిష్టాత్మకమయ్యే అవకాశం. ఉపరాష్ట్రపతి పదవిని గెలవడం ద్వారా జేడీయూ దేశ రాజకీయాల్లో తన స్థానం మరింత బలంగా స్థిరం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీకి కూడా బీజేపీ విస్తృత ప్రాధాన్యత ఇస్తోంది. కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పదవుల విషయంలో పెద్దగా ఆసక్తి చూపించకపోయినా, రాష్ట్రానికి నిధులు రావాలని మాత్రం అగ్రహంగా అడుగుతున్నారు. అయితే కేంద్రం నిధుల విషయంలో తక్కువ చూపించినా, అధికార పదవుల విషయంలో మాత్రం టీడీపీకి న్యాయం చేస్తున్నట్లుగా సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఓ గవర్నర్ పదవిని ఇచ్చిన కేంద్రం, మరో గవర్నర్ పదవిని టీడీపీకి ఇవ్వబోతోందన్న ప్రచారం నడుస్తోంది. అంతే కాదు, లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ పదవి కూడా టీడీపీకి కేటాయించబోతున్నారని వార్తలు వస్తున్నాయి.


అమలాపురం మాజీ స్పీకర్ గంటి మోహన చంద్ర బాలయోగి కుమారుడికి ఈ పదవి దక్కే అవకాశముందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. మొత్తానికి కేంద్రంలో బీజేపీ అంకెల పరంగా బలహీనంగా ఉన్నా, వ్యూహాత్మకంగా జేడీయూ, టీడీపీ వంటి కీలక మిత్రపక్షాలను ప్రసన్నం చేసుకుంటూ ప్రభుత్వాన్ని స్థిరంగా కొనసాగించే ప్రయత్నంలో ఉంది. నితీష్‌కుమార్‌కు ఉపరాష్ట్రపతి పదవి, టీడీపీకి డిప్యూటీ స్పీకర్ పదవి వంటి గౌరవాలు అందించడం ద్వారా బీజేపీ తమ మిత్రపక్షాలను దృఢంగా తమ పక్కన నిలిపే ప్రయత్నంలో విజయవంతమవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర రాజకీయాల్లో రాబోయే రోజుల్లో మిత్రపక్షాల ప్రభావం మరింతగా పెరగనున్నట్టు సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: