సాధార‌ణంగా జెడ్పీటీసీ(జిల్లా ప‌రిష‌త్ టెరిటోరియ‌ల్ కాన్సిట్యుట్యెన్సీ) ఎన్నిక‌లు అంటే.. పెద్ద‌గా ఎవ‌రూ ప‌ట్టించుకోరు. పైగా.. స్థానికంగా ఉన్న నాయ‌కులకు మాత్ర‌మే పూర్తి బాధ్య‌త‌లు అప్ప‌గించేస్తారు.కానీ, వైసీపీ అధినేత జ‌గ‌న్ సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌లో జరుగుతున్న జెడ్పీటీసీ ఎన్నిక‌ల‌కు మాత్రం ఎన‌లేని ప్రాధాన్యం ఏర్ప‌డింది. ఇది ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో ఎట్టి ప‌రిస్థితిలోనూ పాగా వేయాల‌న్న‌ది టీడీపీ వ్యూహం. దీంతో మంత్రుల నుంచి ఎంపీల వ‌ర‌కు కూడా అంద‌రూ అక్క‌డే తిష్ఠ వేశారు.


ఇక‌, ఈ నెల 12న పులివెందుల జెడ్పీటీసీకి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అంటే.. ఆదివారం సాయంత్రంతో ఎన్నికల ప్ర‌చారం ముగియ‌నుంది. ఇక‌, అప్ప‌టి నుంచి సోమ‌వారం వ‌ర‌కు జ‌రిగే రాజ‌కీయాలు మ‌రింత భిన్నంగా ఉండ‌నున్నాయ‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే కాకెక్కిన ఈ ఎన్నిక‌లు మ‌రింత మ‌ర‌గ‌నున్నాయ‌ని స‌మాచారం. ఎందుకంటే.. ఎంపీ శ‌బ‌రి నుంచి అనంత‌పురం ఎంపీ, మంత్రులు.. అక్క‌డే ఉండి.. ప‌రిశీల‌న చేస్తున్నారు. వైసీపీ త‌ర‌ఫున కూడా కీల‌క నాయ‌కులు బ‌రిలో నిలిచారు. తిరుప‌తి ఎంపీ కూడా అక్క‌డే ఉన్నారు.


దీంతో ఎవ‌రి స‌త్తా ఏంట‌న్న‌ది.. ఓట‌ర్ల‌ను ఎలా మ‌చ్చిక చేసుకుంటార‌న్న‌ది.. వ‌చ్చే 24 గంట‌ల్లోనే తేలిపో తుంద‌ని చెబుతున్నారు. ఇదిలావుంటే, పులివెందుల‌తో పాటు ఇదే జిల్లాలోని ఒంటిమిట్ట‌కు కూడా జెడ్పీటీసీ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. పులివెందులలో న‌గ‌ర‌పాలక సంస్థ‌లో కలిసిపోయిన గ్రామాలు మినహా మిగిలిన ఐదు ఎంపీటీసీ స్థానాల పరిధిలో ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది.  ఒంటిమిట్టలో 9 ఎంపీటీసీ స్థానాల పరిధిలోని 24,606 మంది తమ ఓటు హక్కును ఉపయోగించుకోనున్నారు.


బ్యాలెట్‌ విధానంలో జరిగే ఈ పోలింగ్‌పై వైసీపీ భారీ ఆశ‌లే పెట్టుకుంది.  గత 30 ఏళ్లుగా పులివెందులలో జెడ్పీటీసీ స్థానాలకి ఒకే ఒకసారి మాత్రమే ఎన్నికలు జరిగాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ 1995, 2006, 2013, 2021లో ఏకగ్రీవ ఎన్నికలు కొనసాగాయి. ఇక, తాజాగా జరుగుతున్న ఉప ఎన్నికలతో 30 ఏళ్ల ఏకగ్రీవలకు బ్రేక్ పడినట్లే అని చెప్పాలి. ఈసారి పోటీలో వైసీపీతో పాటు టీడీపీ, కాంగ్రెస్ పార్టీలో తమ అభ్యర్థులను పోటీలో పెట్టాయి. ప్రధానంగా ఈ ఎన్నికల్లో టీడీపీ- వైసీపీ మధ్య పోటీ ఉంది. మ‌రి ఏంజ‌రుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: