ఏలూరు నియోజకవర్గ రాజకీయాల్లో ప్రస్తుతం ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ కేరఫ్‌ నాని పేరు హాట్‌టాపిక్‌గా మారింది. కాపు సామాజిక వర్గానికి చెందిన ఈ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, రాజకీయాల్లో తనదైన మార్క్‌ వేసుకున్న నేత. వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్‌ చేసిన తర్వాత మొదటి రోజుల్లో చురుగ్గా కనిపించినా, ఇప్పుడు మాత్రం ఎక్కడా కనిపించకపోవడం పెద్ద చర్చకు దారితీసింది. టీడీపీలో చేరిన కొత్తలోనే సీఎం చంద్రబాబు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించారు. కొందరు ఇతర జంపింగ్‌ నేతలు ఆ కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నా, నాని మాత్రం మొదటి రెండు రోజులు హాజరై, ఆ తర్వాత మాయమయ్యారు. కారణం ఏమిటనేది క్లియర్‌ కాకపోయినా, స్థానిక నేతలతో కలిసిరాకపోవడం, అంతర్గత విభేదాలే కారణమని టాక్‌.
 

ఈ విషయంపై కొందరు నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేసినా, పెద్దగా స్పందన రాకపోవడంతో నాని సైలెంట్‌ మోడ్‌లోకి వెళ్లిపోయారని చెబుతున్నారు. ఇదిలా ఉండగా, వైసీపీని వీడి వచ్చినా, ఆ పార్టీలోని కొంతమంది నేతలతో ఇంకా టచ్‌లో ఉన్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంకా షాకింగ్‌ ఏమిటంటే, ఇటీవల హైదరాబాద్‌లో కొందరు వైసీపీ నేతలతో పార్టీ చేసుకున్నారని టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. ఈ మాటలు బయటకు రావడంతో "నాని తిరిగి వైసీపీలోకే వెళ్తారా?" అనే సందేహం బలపడింది. ఎందుకంటే, ఆయన ఇప్పటి వరకు వైసీపీపై ఒక్క మాట కూడా విమర్శించకపోవడం, పార్టీ ప‌రంగా ఎలాంటి అన్యాయం జరగలేదన్న భావనను పబ్లిక్‌లో పెంచుతోంది. ఇదంతా జరుగుతున్న సమయంలో నాని ఎక్కడ ఉన్నారనే ప్రశ్నకి ఎవరికీ సమాధానం దొరకడం లేదు.

 

ఆయనను సంప్రదించేందుకు కొన్ని ఆన్‌లైన్‌ ఛానెల్లు ప్రయత్నించగా, ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ లోనే ఉండటంతో వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఏలూరులో అయితే నాని గైర్హాజరు హాట్‌ టాపిక్‌గా మారి, టీడీపీ, వైసీపీ క్యాంపులలోనూ చర్చలు మిన్నంటుతున్నాయి. పరిశీలకుల మాటల్లో, పార్టీ మార్చడం అంత కష్టమేమీ కాదు కానీ, ఆ పార్టీలో స్థిరంగా కొనసాగడం మాత్రం అసలు ఛాలెంజ్‌. నాని పరిస్థితి కూడా అదే. ఇప్పుడు ఆయన ముందున్న మార్గం రెండే — టీడీపీలో కొనసాగి తన స్థానాన్ని బలపరచుకోవడం లేదా తిరిగి వైసీపీలోకి వెళ్లి పాత బంధాలను సుస్థిరం చేసుకోవడం. ఏదైతే అయినా, ఏలూరు రాజకీయాల్లో నాని ఎంట్రీ, ఎగ్జిట్‌ స్టైల్‌ మళ్లీ పెద్ద గందరగోళాన్ని సృష్టించబోతోందన్న మాట పక్కా.

మరింత సమాచారం తెలుసుకోండి: