
రాజకీయ వర్గాల్లో రెండు ప్రధాన అవకాశాలు ప్రస్తావనకు వస్తున్నాయి. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి పాత టీడీపీ మనిషి కావడం, చంద్రబాబు శిష్యుడిగా పేరు తెచ్చుకోవడంతో.. రేవంత్ కోరితే టీడీపీ కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తుందని ఒక వర్గం భావిస్తోంది. మరోవైపు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ-జనసేన-టీడీపీ కూటమి బలంగా కొనసాగుతుండడం, కేంద్రంలోనూ బీజేపీతో మంచి సంబంధాలు కలిగి ఉండటంతో చంద్రబాబు బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వక తప్పదని మరో వర్గం అంటోంది. ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికల సందర్భంలోనూ చంద్రబాబు తన నిర్ణయాన్ని బీజేపీ అభ్యర్థి రాధాకృష్ణన్‌కు ఇచ్చారు. ఇదే ఆయన భవిష్యత్ వైఖరికి సంకేతమని అంటున్నారు. పైగా కేంద్ర మంత్రి బండి సంజయ్ తరచూ ఏపీ పాలనను ప్రశంసించడం, కూటమిపై నమ్మకం వ్యక్తం చేయడం కూడా ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి.
జూబ్లీహిల్స్‌లో టీడీపీకి గణనీయమైన ఓటు బ్యాంక్ ఉంది. ముఖ్యంగా సెటిలర్లు, వ్యాపారవర్గాలు, మధ్యతరగతి ఓటర్లు ఈ పార్టీ వైపు మొగ్గు చూపుతారు. అందువల్ల టీడీపీ మద్దతు ఏ పార్టీకి దక్కుతుందో ఆ పార్టీ విజయావకాశాలు పెరుగుతాయి. ఇదే కారణంగా ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టీడీపీ స్థానం కీలకమైందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి, చంద్రబాబు ఏ దిశగా నిర్ణయం తీసుకుంటారనేది ఉప ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే అంశం. రేవంత్ కోరితే కాంగ్రెస్‌కు, బీజేపీ ఒత్తిడి చేస్తే ఆ పార్టీకీ మద్దతు వెళ్లే అవకాశం ఉంది. ఈ వ్యూహాత్మక నిర్ణయం టీడీపీ భవిష్యత్ రాజకీయాలకూ దిశానిర్దేశం చేస్తుందనడంలో సందేహం లేదు.