
- టిడిపి అధికారంలోకి రాకముందే కరేడు నుంచి అవినీతికి బీజం పడింది
- పోలీసులను అడ్డం పెట్టుకొని దౌర్జన్యాలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు
- గతంలో సేకరించిన లక్షల ఎకరాల్లో ఎన్ని పరిశ్రమలు, ఉద్యోగాలు వచ్చాయో చెప్పగలరా?
- కరేడు రైతు ఉద్యమంలో రాష్ట్రంలోని ప్రతి రైతూ పాల్గొనాలి
- చంద్రబాబూ... రైతులతో చర్చకు సిద్దమా?
- ఇండోసోల్ కంపెనీని దోపిడీ దొంగ అన్న టిడిపి నేతలే ఇప్పుడు వేల ఎకరాలు కట్టబెట్టడం సిగ్గుచేటు
- కరేడు గ్రామ సభలో బిసివై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ భావోద్వేగ ప్రసంగం
కరేడులో రైతుల భూములను లాక్కునేందుకు ప్రయత్నం చేస్తే గ్రామ నడిబొడ్డున రైతులతో కలిసి ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని బిసివై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ ప్రకటించారు. ఆదివారం కరేడులో జరిగిన గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగ ప్రసంగం చేశారు. అన్యాయానికి గురవుతున్న రైతుల పక్షాన పోరాటం చేసేందుకు పోలీసులు అనుమతి ఇవ్వకపోతే... కోర్టులు నుంచి అనుమతి తీసుకొని రావాల్సి వచ్చిందన్నారు. బాధితులకు అండగా నిలిచే హక్కును ప్రజాస్వామ్యం కల్పించినా అందుకు అనుమతి ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. పోలీసులను ప్రజల భద్రతకు, స్వేచ్చా వాయువులు పీల్చేందుకు ఉపయోగించాల్సింది పోయి దోపిడీ దారులు, అరాచక శక్తులకు అండగా నిలిచేందుకు ఈ ప్రభుత్వం వినియోగించడం దారుణమన్నారు. పోలీసులు ప్రజలకు శాంతియుత జీవనం అందించేందుకే ఉద్యోగంలో చేరారని, అలా కాకుండా ప్రజా వ్యతిరేక విధానాలకు వినియోగిస్తే వారు కూడా తిరగబడాలని పిలుపునిచ్చారు.
సెంటు భూమిని కూడా తీసుకోలేరు
కరేడు రైతుల నుంచి బలవంతంగా సెంటు భూమిని కూడా తీసుకోలేరని రామచంద్రయాదవ్ హెచ్చరించారు. కరేడు గ్రామం చుట్టూ ఎంతో మంది దేవుళ్లు ఉన్నారన్నారు. శ్రీ జ్ణాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామి వారితో పాటు 15 మంది వరకు గ్రామ దేవతలు, దేవుళ్లు వేంచేసి ఉన్నారన్నారు. అలాంటిది ఎవరో ఓ అనామకుడు వచ్చి గ్రామాన్ని ఖాళీ చేయిస్తారంటే ఎలా నమ్ముతారని గ్రామస్తులను ప్రశ్నించారు. గ్రామానికి దేవుళ్ల అండ మెండుగా ఉందని.. ఎవరూ ఏమీ చేయలేరని ధైర్యాన్నిచ్చారు.
భూసేకరణ చేసిన లక్షల ఎకరాల్లో ఎన్ని కంపెనీలు పెట్టారు? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు?
రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పుడల్లా సెజ్ లను, పరిశ్రమల స్ధాపన కోసం భూములను బలవంతంగా లాక్కోవడం పరిపాటిగా మారిందని రామచంద్రయాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు తీసుకున్న లక్షలాది ఎకరాల భూముల్లో ఎన్ని కంపెనీలు వచ్చాయో లెక్క చెప్పాలన్నారు. అలాగే ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో కూడా సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. భూములను పరిశ్రమల పేరుతో తీసుకొని దోపిడీకి పాల్పడుతున్నారని ఎద్దేవా చేశారు. కావలి సెజ్ కోసం తీసుకున్న భూముల్లో ఎన్ని ఎకరాల భూముల్లో పరిశ్రమలు పెట్టారో సమాధానం చెప్పగలరా? అని ప్రభుత్వాలను ప్రశ్నించారు.
కరేడు రైతులకు రాష్ట్రంలోని ప్రతి రైతు మద్దతివ్వాలి
బలవంతంగా భూములను లాక్కునేందుకు ప్రయత్నిస్తే ఒక్కటై ఉద్యమించిన కరేడు రైతుల ఐకమత్యం ఎంతో మందికి స్పూర్తి దాయకమని రామచంద్రయాదవ్ కొనియాడారు. పోలీసులను పంపించి ఎన్ని భయభ్రాంతులకు గురి చేసినా ఏమాత్రం వెనకడుగు వేయకుండా పోరాటం చేయడం నిజంగా అభినందనీయమన్నారు. కరేడు రైతులకు రాష్ట్రంలోని ప్రతి రైతూ అండగా ఉండాలని పిలుపునిచ్చారు. నేడు కరేడు కదా అని సైలెంట్ గా ఉంటే రేపు మీదాక రారని గ్యారెంటీ ఏంటని ప్రశ్నించారు. ఇది కరేడు సమస్య కాదని, రైతుల సమస్య అని రామచంద్రయాదవ్ తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్రంలోని రైతులంతా ఏకమై కరేడు రైతులకు మద్దు ఇవ్వాలని పిలుపునిచ్చారు.
నాడు గజదొంగ అన్నారు... నేడు భూములు కట్టబెట్టారు
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇండోసోల్ కంపెనీని చంద్రబాబు సహా కొందరు టిడిపి నేతలు గజదొంగలుగా అభివర్ణించారని, కానీ అధికారంలోకి రాగానే వారిపై ప్రేమ పుట్టుకు వచ్చిందని ఎద్దేవా చేశారు. వైసిపి హయాంలో ఇండోసోల్ కంపెనీ యజమాని అయిన విశ్వేశ్వరరెడ్డికి వందల కోట్ల కాంట్రాక్టులు కట్టబెట్టారని టిడిపి నేతలు ప్రచారం చేశారన్నారు. అలాంటిది అధికారంలోకి రాకముందే చంద్రబాబు నాయుడు కరేడు నుంచి అవినీతికి బీజం వేశారన్నారు. 2024 జనవరిలో 40 కోట్ల రూపాయలు ఎలక్ట్రోరల్ బాండ్లు రూపంలో ఇండోసోల్ కంపెనీ నుంచి తీసుకున్నారని విమర్శించారు. ఇటీవల కేంద్రమంత్రిని కలిసిన సందర్భంలో భూసేకరణ అంశం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమని స్పష్టం చేశారని గుర్తు చేశారు.
స్టీల్ ప్లాంట్ రైతుల దుస్థితే నిదర్శనం
విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఎంతో మంది రైతులు స్వచ్చందంగా భూములు ఇచ్చారన్నారు. దాదాపు 15వేల మంది రైతులు తమ భూములను ఇచ్చారని రామచంద్రయాదవ్ తెలిపారు. అప్పట్లో ఎకరా పదిహేను వందల నుంచి మూడు వేల రూపాయలు పరిహారం ఇచ్చి తీసుకున్నారన్నారు. కానీ నేడు ఆ భూముల విలువ కోట్లలో పలుకుతోందన్నారు. కానీ ఇప్పుడు ఆ భూములతో పాటు స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా కూడా భూములు ఇచ్చిన రైతు కుటుంబాలకు ఉద్యోగాలు కూడా ఇవ్వలేదన్నారు. కరేడు రైతుల పరిస్థితి కూడా అలాగే తయారయ్యే అవకాశం ఉందన్నారు. ఎన్నో ప్రభుత్వ భూములు ఉన్నా... మూడు పంటలు పండే కరేడు భూములను లాక్కునేందుకు జరుగుతున్న ప్రయత్నం ఓ మహాకుట్రగా ఆయన అభివర్ణించారు.
ఆ ఒక్క పనిచేస్తే చంద్రబాబుకు విగ్రహం పెట్టిస్తాం
కరేడు రైతుల ఆవేదనను పెద్ద మనసుతో అర్ధం చేసుకొని భూ సేకరణ ఆపితే చంద్రబాబుకు కరేడు సెంటర్ లోనే విగ్రహం పెట్టి పూజిస్తామని బోడె రామచంద్రయాదవ్ ప్రకటించారు. చంద్రబాబు సహ్రుదయంతో రైతులతో చర్చలు జరపాలన్నారు. రైతుల ఆవేదనను అర్ధం చేసుకోవాలని కోరారు. ఒకవేళ అలా కాకుండా భూసేకరణకే మొగ్గు చూపితే కరేడు సెంటర్ లోనే ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని రామచంద్రయాదవ్ ప్రకటించారు. విగ్రహం కావాలో... రైతుల ఆగ్రహం కావాలో చంద్రబాబే తేల్చుకోవాలన్నారు.
ఆ పోలీసులపై చర్యలు తీసుకోండి
కోర్టు అనుమతితో తాను కరేడులో గ్రామ సభ నిర్వహిస్తే... ఆ సభకు వస్తున్న మహిళలు, రైతుల పట్ల కొందరు పోలీసులు అమానుషంగా వ్యవహరించారని రామచంద్రయాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పొలాల వెంట పరుగులు పెట్టించి దమనకాండకు పాల్పడ్డారన్నారు. వారి పట్ల జులుం ప్రదర్శించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైతే రైతులు, మహిళల పట్ల అమానుషంగా ప్రవర్తించారో ఆ పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.